TDP-Yuva-Galam-NaraLokeshటిడిపి యువ నాయకుడు నారా లోకేష్‌ శుక్రవారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని రేణుకాపురం నుంచి 15వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ప్రతీరోజులాగే ఇవాళ్ళ కూడా ముందుగా అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో ‘సెల్ఫీ విత్ లోకేష్’ కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగారు. తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన టిడిపి అభిమానులతో నారా లోకేష్‌ సమావేశమయ్యారు.

తర్వాత పాదయాత్ర ప్రారంభించి దారిలో గొల్లకండ్రికలో గ్రామస్తులతో కాసేపు మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. ఉదయం 10.30 గంటలకి ఎగువ కమ్మ కండ్రిక చేరుకొని అక్కడ రైతులతో మాట్లాడారు. మధ్యాహ్నం 1.15 గంటలకి కాపు కండ్రికలో బలిజకాపు కులస్తులతో మాట్లాడారు. సాయంత్రం 5.30 గంటలకి ఎస్ఆర్ పురంలోని ఆంజనేయస్వామివారి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకొన్నాక అక్కడే సమీపంలో క్యాంప్ సైట్‌లో రాత్రి బస చేస్తారు. అక్కడే నియోజకవర్గంలోని టిడిపి నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్‌ సమావేశమయ్యి నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారు.

ఈరోజు దారిలో నారా లోకేష్‌ ప్రజలతో మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకొని ఆయన చేతిలో మైక్ బలవంతంగా లాకొన్నారు. దీంతో నారా లోకేష్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేనేమీ ఇక్కడ బహిరంగసభ నిర్వహించడం లేదు. పాదయాత్రలో నన్ను పలకరిస్తున్న ప్రజలతో మాట్లాడుతున్నాను. అంతే! కానీ మీరు నా చేతిలో నుంచి మైక్ ఎందుకు లాక్కొన్నారు?ఏ చట్టం, నిబందన ప్రకారం నా చేతిలో మైక్ లాక్కొన్నారు?మర్యాదగా నా మైక్ నాకు తిరిగి ఇస్తారా లేదా?లేకుంటే నేను ఇదే విషయం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి అక్కడే మైక్ తీసుకొంటాను. అప్పుడు మీరు కోర్టుకు రావలసి ఉంటుంది,” అని హెచ్చరించారు.

నారా లోకేష్‌ టిడిపికి చెందినవారు కనుక పోలీసులు ధైర్యంగా వెళ్ళి ఆయన చేతిలో నుంచి మైక్ లాక్కోగలిగారు. అదే… ఏ మంత్రి లేదా వైసీపీ నాయకుడో మాట్లాడుతుంటే ఆయన చేతిలో నుంచి మైక్ లాక్కొనే సాహసం చేయగలరా?చేయలేరంటే అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్ష పార్టీలకి మరొక రూలు పాటిస్తారనుకోవచ్చు.