TDP_Yuva_Galam_lokesh_Naraయువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేస్తున్న ప్రసంగాలు, వాదనలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. గురువారం ఆయన పాదయాత్రలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “2019 ఎన్నికలలో ఓడింది టిడిపి కాదు… చంద్రబాబు నాయుడు అంతకంటే కాదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఓడిపోయింది. నారా లోకేష్‌ లేదా చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి ఎవరూ శాశ్వితం కారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రమే శాశ్వితం. కనుక రాష్ట్రాభివృద్ధి కోసమే ఏ ప్రభుత్వామైనా పనిచేయాలి. కానీ 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధిపనులన్నీ నిలిచిపోయాయి. మరోపక్క అప్పుల భారం నానాటికీ పెరిగిపోతూనే ఉంది,” అంటూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై నారా లోకేష్‌ నిశిత విమర్శలు చేశారు.

గత ఎన్నికలలో టిడిపి గెలిచి అధికారంలో కొనసాగి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి నేడు ఏవిదంగా ఉండేది?అని నారా లోకేష్‌ మాటలు ఆలోచింపజేస్తాయి. టిడిపి అధికారంలో కొనసాగి ఉండి ఉంటే ఈపాటికి అమరావతికి ఓ రూపురేఖలు వచ్చి ఉండేవి. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది గనుక రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉండేవి. విశాఖ రాజధాని కాకపోయినా అక్కడికి కొత్తగా అనేక ఐ‌టి కంపెనీలు, అచ్యుతాపురం సెజ్‌లో అనేక పరిశ్రమలు వచ్చి ఉండేవి. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అభివృద్ధి పనులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు ఓ కొలిక్కి వచ్చి ఉండేవి. సాగునీటి వసతి మెరుగు పడితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. దాంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. టిడిపి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అభివృద్ధిపనులన్నీ యదాతదంగా జరుగుతుండేవి కనుక పెట్టుబడిదారులకి స్పష్టమైన సంకేతాలు వెళ్ళి ఉండేవి. రాష్ట్రంలో మౌలికసదుపాయలు పెరిగి, ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు కూడా మారి ఉండేవి. సుస్థిర ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొనేందుకు పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉంది.

కానీ ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలు అన్నీ మారిపోయాయి. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన అమరావతిని వైసీపీ ప్రభుత్వం పాడుబెట్టి విశాఖ రాజధాని అంటుండటంతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కి వెళ్ళిపోతున్నారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రులే మూడు రాజధానుల పేరుతో ఆందోళనలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తుండటంతో రాష్ట్రంలో ఒకరకమైన అశాంతి వాతావరణం నెలకొంది. అంటే ప్రభుత్వాలు మారినా విధానాలు నిలకడగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది. కానీ నేటికీ ఆ పరిస్థితి లేనందున ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ ఇంకా ఆగమ్యగోచరంగానే ఉంది.