YS-Jagan-Chandrababu-Naiduరాజకీయ పార్టీలు, వాటి నాయకులు తమ ప్రత్యర్దులను దెబ్బ తీసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ ప్రయత్నాలలో నైతిక విలువలను మరిచి రాజకీయాల పేరిట కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. అప్పుడు వారిని ఎదుర్కొనేందుకు వారి ప్రత్యర్ధులు కూడా మరో మెట్టు దిగి కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. ఈవిదంగా రాజకీయ ఆధిపత్యపోరులో ఒక పార్టీ ఒక మెట్టుదిగి నీచరాజకీయాలు చేస్తే, అప్పుడు ప్రత్యర్ధి తన మనుగడ కోసం రెండు మెట్లు దిగి నీచ రాజకీయాలు చేస్తుంటాడు. ఈవిదంగా రాజకీయ పార్టీలు, నేతలు నైతిక విలువలను పక్కనపెట్టి ఒక్కో మెట్టూ దిగుతూ దిగుతూ చివరికి ఆ బురదలోనే కూరుకుపోయి, ప్రత్యర్ధులు తమపై బురద జల్లుతున్నారని బాధపడుతూ తిరిగి బురద జల్లుతుంటారు. రాజకీయంగా ఎంతో ఎదగాలనుకొని చివరికి అందరూ ఆ బురదలో కూరుకుపోయి పైకి రాలేక అదే స్వర్గమనుకొని బ్రతికేస్తుంటారు.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి కనుక. రాష్ట్ర ప్రజలకు, పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలవాల్సిన సిఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వారిని వారించకపోగా ఆయన చిర్నవ్వులు చిందించారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఇద్దరూ రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ భువనేశ్వరి మాత్రం ఏనాడూ రాజకీయాల గురించి కనీసం మాట్లాడలేదు. రాజకీయాలకు ఆమె చాలా దూరంగా ఉంటారని అందరికీ తెలుసు. అటువంటి ఆమెపై వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో సహజంగానే టిడిపి నేతలు కూడా ఘాటుగా స్పందించారు.

రాజకీయాలకు సంబందం లేని భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ అధినేత అర్దాంగి భారతిని ఉద్దేశ్యించి టిడిపిలో ఎవరో చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతూ వైసీపీ ట్విట్టర్‌లో ఈ మెసేజ్ పెట్టింది.
“మ‌హిళ‌లను అవ‌మానించిన వారెవ్వ‌రైనా మాడి మ‌సై పోవాల్సిందే..ఇది చ‌రిత్ర‌. దేవీ న‌వ‌రాత్రుల తొలిరోజున‌ సాక్షాత్తు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ స‌తీమ‌ణి భార‌తి గారిని ఎలాంటి సంబంధం లేని విష‌యంలో “భార‌తి పే” అంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్న టీడీపీ నేత‌ల‌కు ఇదే గ‌తి ప‌ట్ట‌బోతోంది,” అని ట్వీట్ చేశారు.

రాష్ట్ర రాజకీయాలు ఎందుకు ఇంత దిగజారిపోయాయని సామాన్య ప్రజలు కూడా బాధపడుతున్నారు. అయితే దీనికి కారణం పైన చెప్పుకొన్నదే. అధికారంలో ఉన్నవారు నైతిక, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటూ ప్రతిపక్షాల పట్ల సంయమనంగా వ్యవహరిస్తున్నట్లయితే, అప్పుడు ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటిస్తుంటాయి. కానీ మనం చెప్పుతో కొట్టిన్నట్లు మాట్లాడి ఎదుటవారు సౌమ్యంగా ఉండాలని ఆశించడం అత్యాసే అవుతుంది కదా?

తమిళనాడు రాష్ట్రంలో జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నప్పుడు అక్కడ ఇలాగే నీచరాజకీయాలు చేసుకొని ఇద్దరూ తీరని అవమానాలు, అప్రదిష్ట భరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలో అంతకంటే నీచమైన రాజకీయాలు నడుస్తున్నాయి. కనుక పర్యావసనాలకు అందరూ సిద్దంగా ఉండాల్సిందే… భరించాల్సిందే. వద్దనుకొంటే హుందాగా మెలగడం నేర్చుకోవలసిందే.