MLC Electionsదాదాపు రెండు రోజుల ఉత్కంఠతకు తెరదించుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంయల్సీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. మూడున్నరేళ్ళ పాలన మీద ఉన్న యాంటి ఇన్కమ్బెన్సీతో అధికార పార్టీ, వివిధ ప్రజా సమస్యలపై పోరాటాలతో ప్రధాన ప్రతిపక్షం కోలుకున్న నేపధ్యంలో రెండు ప్రధాన పక్షాల అభ్యర్థులకూ సమాన అవకాశాలు ఉన్న ఈ స్ధానం ఫలితాలు తెలుగుదేశం ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితం సాధించిందనే చెప్పుకోవాలి. తెలుగుదేశం బలపరచిన వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నిక జరిగిన ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తీసుకుంటే 34 నియెూజకవర్గాలున్నాయి, వాటిలో గత ఎన్నికల్లో అధికార పార్టీ ఏకంగా 28 స్ధానాలు గెలిచింది, విజయనగరం జిల్లా అయితే స్వీప్ చేసింది. అటువంటి చోట పట్టభద్రుల ఎన్నికలో 2,01,335 మంది ఓటు హక్క వినియెూగించుకుంటే వైసిపికి వచ్చిన ఓట్లు 55,749 ఐతే టిడిపి అభ్యర్థి 89,957 ఓట్లుతో 22,208 ఓట్ల మెజారిటీ మెదటి ప్రాధాన్య ఓటులో సాధించారు. అంటే దాదాపు 44.5% ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి వచ్చాయి. 34 నియెూజకవర్గాల పరిధిలో 2 లక్షల పైచిలుకు ప్రజల అభిప్రాయాలతో 2024 ఎన్నికలకు ముందు ఇంతకంటే సాదికారిక సర్వే మరే సంస్ధా చెయ్యలేదేమెూ. మరొక సంవత్సరంలో జరిగే ఎన్నికలకు ఈ 34 నియెూజకవర్గాల ప్రజల ఆలోచన ప్రస్పుటంగా తెలిసినట్టే. మరేవైనా కారణాలుంటే తప్ప అసెంబ్లీ ఎన్నికలకు ఫలితాలు మరోరకంగా ఉండే అవకాశం తక్కువ, అందుకు ఉదాహరణగా 2017 లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

మూడున్నరేళ్ళ పాలనలో ప్రతిపక్ష నాయకులపై కేసులు, నిర్భందాలతో అసలు అసెంబ్లీ ఎన్నికలు తప్ప మిగిలిన వాటిలో పోటీ చేయలేమేమెూ అనే పరిస్ధితిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం తొలుత ఒక అభ్యర్థిని ప్రకటించి చివరి నిమషంలో నామినేషన్లకు ముందు అభ్యర్థిని మార్చి కార్యకర్తల్లో ఇంకాస్త గందరగోళం కలుగజేస్తే, మరోపక్క అధికార వైసిపి ఆరు నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేసుకుని, అంగ, అర్ధ బలాలతో సిద్దమైంది. ఇక మూడేళ్ళ నుండి విశాఖ ఎక్సెక్యూటివ్ రాజధాని అని చెబుతూ వస్తున్న వైసిపి నాయకులు కొంత కాలంగా గేరు మార్చి విశాఖే ఏకైక రాజధాని అని చెబుతున్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉన్నా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే రెండు సభల్లో రెండు మూడు నెలల్లో విశాఖకు వస్తున్నాం అని కూడా ప్రకటించారు. ఇంక ఈ పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పెద్ద ఎత్తున పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించి 14 లక్షల కోట్లతో పెట్టుబడులు, ఉపాధి అంటూ నిరుద్యోగులకు, యువతకు గాలం వేసారు. ముఖ్యమంత్రి చిన్నాన్న, ఉత్తరాంధ్ర ఇంచార్జి సుబ్బారెడ్డి మంరింత ముందుకెళ్ళి ఏకంగా సెమీ ఫైనల్ అన్నారు. అధికార వైసిపి ఇంత స్ధాయిలో సిద్దమై, విజయంపై ధీమా వ్యక్తపరచినా వచ్చిన ఫలితంతో అధికార పార్టీ నాయకుల దిమ్మతిరిగింది.

విశాఖను రాజధానిగా ప్రకటించి, లక్షల కోట్ల పెట్టుబడులని చెప్పి ఊరించినా ఎందుకు ఫలితం తేడా వచ్చింది? ప్రజలు నమ్మలేదా? నిజానికి దాదాపు 4 ఏళ్ళ పాలన తరువాత కొంత వ్యతిరేకత వచ్చినా, ఉత్తరాంధ్ర విషయంలో అనేక ఇతర విషయాలు ప్రజల్లో తీవ్రవ్యతిరేకతను పెంచాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన రోజు నుండే విశాఖపై ఓ సామాజిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాలారు. ఇక వాళ్ల భూకబ్జాలకు అంతే లేకుండా పోయింది. మెడమీద కత్తి పెట్టి మరీ భూములు సొంతం చేసుకున్నారు. మాట వినని వారి మీద అధికారం మాటున నోటీసులు, జేసిబిలు నిత్యకృత్యం అయ్యాయి. ఉత్తరాంధ్రకు సామంత రాజులా వ్యవహరించిన ఆ వర్గం నాయకుడు గెస్ట్ హౌస్ లో కూర్చుని వివాదస్పద భూముల ఫైళ్ళు తెప్పించుకుని మరీ భూదోపిడీ సాగించారనే ఆరోపణలు బలంగా వచ్చాయి, ఎంతలా అంటే రెండేళ్ళ పాలనలో 40 నేల కోట్ల విలువ చేసే భూములు ఈ వర్గం నాయకుల పరమయ్యాయని ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీళ్ల భూ దాహానికి రుషికొండ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇంక దశాబ్దాలుగా విశాఖకు తలమానికంగా అనేక సంస్థల భూములు కూడా చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి బేపార్క్, వాల్తేర్ క్లబ్, గీతం, రామానాయుడు స్టూడియో మెుదలైనవి ఉన్నాయి. ఇంక అ వర్గం నాయకుల అండదండలతో, స్ధానిక నాయకులైన సబ్బం హరి, అచ్చంనాయుడు, కూన రవికుమార్, రౌతు శిరీష వంటి వారిపై జరిగిన దాడులకైతే లెక్కేలేదు. డా. సుదాకర్ వంటి దళిత వ్యక్తిని ఎంత దారుణంగా హింసించారో ప్రజల మదిలో నుండి చెరిగిపోలేదు. వీటన్నిటినీ మించి ఆంధ్రుల హక్కుగా సాదించుకున్న విశాఖ ఉక్కుని తుక్కుగా అమ్మేసి, భూములు కొట్టేద్దామనే విదంగా అధికార పార్టీ నాయకుల విన్యాసాలు చూస్తూనే ఉన్నారు. ఇక ఈ ప్రాంతానికి రాజకుటుంబమైన గజపతి రాజు గారిని వేదించి, రకరకాలుగా అవమానించి వారి ట్రస్టు భూములను కాజెయ్యాలనే కుతంత్రాలు మరువనే లేదు. అక్కడే ఉన్న మరో ప్రముఖ గంగవరం పోర్టును ఎలా అస్మదీయులకు కట్టబెట్టారో చూసారు. లాటరైట్ కోసం మన్యాన్ని చెరబట్టింది చూసారు. ఇంక ఓ యూనివర్సిటీలో రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఆ యూనివర్సిటీని ఓ పార్టీ కార్యాలయంలా మార్చారనే ఆరోపణలు. ఇలా అంతులేని అరాచకాలతో ఓ వర్గం పెద్దలు విశాఖను కబళించిన వైనంతో సామాన్యులు ఆలోచనలో పడ్డారు, వీరి అరాచకాలు ఇప్పుడే ఈ విధంగా ఉంటే రాజధాని పేరుతో ఇక్కడకు వచ్చి వాలే రాబందుల గురించి ఆలోచించి వీరి కుయుక్తులను తిప్పికొట్టారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి అధికార పార్టీ తన నాయకులను హద్దుల్లో ఉంచి, విధానాలు మార్చుకుంటే తప్ప అత్యంత దారుణ ఫలితాలకు సిద్దపడాలి.

శ్రీకాంత్.సి