TDP-YSRCP-Fight-Visakhapatnamవిశాఖపట్నంలో ఈరోజు ఉదయం టిడిపి, వైసీపీ నేతల మద్య ఘర్షణ జరిగింది. అక్కయ్యపాలెంలోని సంఘం ఆఫీస్ జంక్షన్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు నగర మేయర్ గోలగాని వెంకట హరికుమారి, డెప్యూటీ మేయర్ కాటుమూరి సతీష్ తదితర వైసీపీ నాయకులు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న జీవీఎంసీలో టిడిపి ఫ్లోర్ లీడర్ పేల శ్రీను, ఆ వార్డు కార్పొరేటర్ శ్రావణి మరికొందరు టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకొని, మేము గెలిచిన వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని ఆహ్వానించాలి కానీ వార్డు మెంబర్లుగా పోటీ చేసి మా చేతుల్లో ఓడిపోయిన వైసీపీ నేతలను ఆహ్వానించడం ఏమిటి? అని నిలదీశారు. దానికి వారు చాలా దురుసుగా సమాధానం చెప్పడంతో పేల శ్రీను, టిడిపి వార్డు మెంబర్ శ్రావణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇరు వర్గాల మద్య తీవ్ర వాదోపవాదాలు జరిగి తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటలో పేల శ్రీను కింద పడిపోవడంతో స్వల్పంగా గాయపడగా, టిడిపి వార్డు మెంబర్ ముక్కా శ్రావణి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నేతలు తమపై దౌర్జన్యం చేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు చూస్తుండిపోయారు తప్ప వారిని అడ్డుకోలేదని, తమనే అక్కడి నుంచి దూరంగా తరిమేయాలని ప్రయత్నించారని పేల శ్రీను ఆరోపించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు నానాటికీ ఎక్కువైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రోటోకాల్ వివాదం, వైసీపీ నేతల దాడి గురించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని టిడిపి నేతలు అన్నారు.