Ganta Srinivasa Rao - Chandrababu Naiduతెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసింది. ఓడిపోవడం వరకు సరే గానీ ఇంత ఘోరమైన ఓటమికి కారణం ఏంటో ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. 175 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో కంచుకోటలు కూలిపోయాయి మంత్రులు సైతం ఓడిపోయారు. టీడీపీకి కంచుకోట అనుకునే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ 27 సాధించింది.

కానీ ఈ సారి మాత్రం… కేవలం ఆరు స్థానాలకు పరిమితయిపోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఆ పార్టీ ఖాతా కూడా ఓపెన్ చెయ్యలేదు. ఏదో అక్కడక్కడా చెదురుమొదురుగా సీట్లు రాబట్టింది. అయితే విశాఖపట్నం సిటీ మాత్రం టీడీపీ వెనుక బలంగా నిలబడింది. సిటీ కింద వచ్చే నాలుగు సీట్లలో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. హుద్ హుద్ తుఫాను సందర్భంగా అతలాకుతలం అయిపోయిన నగరాన్ని చంద్రబాబు కన్న తండ్రిలా సాకారు. బస్సులోనే కాపురం పెట్టి పరిస్థితిలు చక్కదిద్దారు.

ఆ తరువాత పునర్నిర్మాణం కూడా అంతే వేగంగా చేశారు. అవి గుర్తు పెట్టుకుని విశాఖ ప్రజలు టీడీపీ వెంట నడిచారు. ఈ ఐదేళ్ళ కాలంలో విశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారు అమరావతికి అన్నీ తరలించుకుని పోతున్నారు అని విపక్ష పార్టీలు ప్రచారం చేసినా అవేమి అక్కడ ప్రజల మీద పని చెయ్యలేదు. అయితే విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని మాత్రం టీడీపీ గెలవలేకపోయింది. కారణం ఆ పార్టీ ఓటర్లు ఎంపీకి జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు క్రాస్ ఓటింగు చెయ్యడమే.