TDP_and_YSRCPఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంకా కాదు. ఫ్రీగా అందివచ్చిన శక్తివంతమైన సోషల్ మీడియాను ఎడాపెడా వాడేసుకొంటూ తమ భావజాలాన్ని, అభిప్రాయాలను ప్రజలతో పంచుకొంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా తమ రాజకీయ ప్రత్యర్ధులను ఢీకొంటున్నాయి.

ఈ విషయంలో టిడిపి చాలా ఆలోచనాత్మకమైన సందేశాలు, అభిప్రాయాలు, ఆడియోలు, వీడియోలు పెడుతూ తెలుగు ప్రజలని ఆకట్టుకొంటోంది. రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉన్నప్పుడు తమ ప్రత్యర్ధి పార్టీల నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం సహజమే. కొన్నిసార్లు శృతిమించిన వ్యాఖ్యలు లేదా సంభాషణలు భవిష్యత్‌లో పార్టీలు మారినప్పుడు తమకు రాజకీయంగా చాలా ఇబ్బందికరంగా మారుతాయని ఎవరూ ఊహించరు.

ఆనాడు కాంగ్రెస్‌, టిడిపిలో ఉన్న కొందరు నేతలు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి అన్న మాటల వీడియోలను టిడిపి నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆనాడు సిఎం జగన్మోహన్ రెడ్డిని నోరారా తిట్టిన నేతలే ఆ తర్వాత వైసీపీలో చేరి ఆయన భజన చేస్తుండటం విచిత్రంగా అనిపించవచ్చు.

కానీ వారు ఇప్పుడు ఆనాడు తాము జగన్‌ గురించి వెలిబుచ్చిన గొప్ప అభిప్రాయాలు, చేసిన వేళాకోళాలు, విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు చూసుకొంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ టిడిపిని, చంద్రబాబు నాయుడుని గతంలో తిట్టి, ఇప్పుడు టిడిపిలో ఉన్నవారి వీడియోలను వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలరు. కనుక ఈ ఐడియా ప్రజలకు వినోదం పంచవచ్చు కానీ టిడిపి, వైసీపీలకు చాలా ఇబ్బందికరంగా మరే అవకాశం ఉంది. కనుక టిడిపి ఇటువంటివాటికి దూరంగా ఉండటమే మంచిదేమో?