TDP-Kinjarapu-Atchannaiduవిశాఖ రాజధాని పేరుతో వైసీపీ రాజకీయ చదరంగం ఆడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ఈ హడావుడితో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విశాఖ, అనకాపల్లిలో సమావేశాలు నిర్వహించడం, విశాఖ గర్జన సభ పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ని హోటల్‌ గదిలో పోలీసులు నిర్బంధించి వేధించడం వంటి ఘటనలు ఇందుకు తాజా నిదర్శనాలుగా కనబడుతున్నాయి.

కమ్మకాపు, ఇతర అగ్రకులాలను చేజేతులా దూరం చేసుకొన్న వైసీపీ ఇప్పుడు బీసీలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకాలం ప్రజల మద్య ప్రాంతీయ విభేధాలు సృష్టిస్తున్న వైసీపీ నేతలు, ఇప్పుడు ప్రజల మద్య కులచిచ్చు కూడా రగిలించే ప్రయత్నాలు చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది. అయితే విశాఖ ఘటనలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి గట్టిగా ఖండిస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టలేదు. కానీ వైసీపీ ఉత్తరాంద్రలో ప్రశాంతతను, కులచిచ్చుతో రాజకీయంగా టిడిపిని దెబ్బ తీసేందుకు పావులు కదుపుతుండటంతో టిడిపి కూడా కార్యాచారణకు దిగక తప్పలేదు.

వైసీపీ వ్యూహాలకి కౌంటరుగా టిడిపి నేటి నుంచి ఉత్తరాంద్ర జిల్లాల సమస్యలపై పోరుబాట పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్‌ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోరుబాటను విజయవంతం చేయవలసిందిగా టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు టిడిపి నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష తదితరులు నేడు విశాఖ నగరంలోని ఋషికొండను పరిశీలించాలనుకొన్నారు. కానీ టిడిపి పోరుబాట ప్రకటించగానే గురువారం సాయంత్రం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నేతలను అదుపులోకి తీసుకొని గృహనిర్బందంలో ఉంచుతోంది.

టిడిపి ఫైర్ బ్రాండ్ మహిళా నేత అనితా వంగలపూడి గురువారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసి బయటకు రాగానే అక్కడ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని ఆక్షేపించారు. తాను షాపింగ్ మాల్‌కి వెళితే తన వెంట ఇద్దరు పోలీసులను ఉంచి తనపై నిఘా పెట్టారని అనితా వంగలపూడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, “జగన్ అండ్ కోకి విశాఖపై ఎటువంటి ప్రేమాలేదు. వారి దృష్టి అంతా అక్కడ విలువైన భూములను సొంతం చేసుకోవడంపై, ఉత్తరాంద్రలో ఓటు బ్యాంకుపైనే ఉంది. మేము పోరుబాటతో వారి దోపిడీని, అరాచకాలను బయటపెడతామనే భయంతోనే మా పార్టీ నేతలను నిర్బందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే టిడిపి నేతలని చూసి భయపడటం దేనికి?అరెస్టులు చేయడం దేనికి?జగన్ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయాలని చూస్తోంది. కానీ పోలీసులకు భయపడి మేము మా పోరాటాలను మానుకోము. జగన్ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను నిలదీస్తూనే ఉంటాము,” అని అన్నారు.