YS-Jagan-YSR-Congressనిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిరాయింపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమతో ఎందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారో చెప్పనందుకు ఆనందించాలని జగన్ సున్నితంగా హెచ్చరించారు. “నేను డోర్‌ తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కేది కాదు. ఎవరినైనా మా పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే అనుమతిస్తాం,” అని కూడా జగన్ చెప్పుకొచ్చారు.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఉపఎన్నికలలో గెలిచే అవకాశం ఉన్న వారిని మాత్రమే ఆలోచనలో ఉన్నారట జగన్. ఉత్తరాంధ్ర నుండి ఒక ఎమ్మెల్యే, గోదావరి జిల్లాల నుండి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మరియు ప్రకాశం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఉపఎన్నిక, రాజీనామా అనగానే వెనుకడుగు వేశారట.

అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం ఉపఎన్నికలో తాను గెలుస్తా అని ధీమాగా ఉన్నారట. ఇక్కడ విశేషం ఏమిటంటే గతంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ నుండి ఎన్నికై టీడీపీకి ఫిరాయించిన వారే. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఫిరాయించే మొదటి ఎమ్మెల్యే అతనే కావొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే సరైన సమయంలోనే రాజీనామా ఉండొచ్చని అంటున్నారు. ప్రజలు ఒక పార్టీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా ఫిరాయింపులు అనేవి తప్పవని అర్ధం అయిపోయింది.