టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ నేతృత్వంలో మంగళవారం చేబ్రోలులో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పిచ్చి తుగ్లక్ వంటి సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ నానా కష్టాలు అనుభవిస్తున్నారు. సంపూర్ణ మద్యపానం అమలుచేస్తామన్న పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక మద్య నియంత్రణ పేరుతో వైసీపీ నేతలు మద్యం వ్యాపారాలు చేసుకొని ప్రజలను దోచుకొనేందుకు సాయపడ్డారు. వారు తయారుచేసిన కల్తీ మద్యం త్రాగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. సంపూర్ణ మద్యపానంకు బదులు మద్యాంద్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని మార్చేశారు. లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరుగలేదు. ఆ సొమ్మంతా ఏమైపోయిందో… ఎవరు తినేశారో తెలీదు కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనట్లుంది. చేబ్రోలులో పత్తి రైతులను ఆదుకోవడానికి గతంలో మా టిడిపి ప్రభుత్వం వారికి సబ్సీడీని ఇస్తే జగన్ ప్రభుత్వం దానిని కొనసాగించకపోగా పూర్తిగా ఎత్తివేసింది. జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి పంపించేసేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.
Also Read – వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం జగన్ మొసలి కన్నీళ్ళు దేనికి?
ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, ప్రధాన కార్యదర్శి మల్లిపూడి వీరబాబు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, టిడిపి కార్యకర్తలు దూళ్ళ లచ్చబాబు, ఓటుగంటి వీరబాబు, చాలల నానాజీ, కొత్తెం శ్రీను, సింహాచలం తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.