TDP supporting Pawan Kalyan‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా జగన్ ప్రభుత్వం మళ్ళీ అనేక ఆంక్షలను అమలులోకి తెస్తోంది. రాష్ట్రంలోని వీఆర్వోలు అందరూ ధియేటర్ల వద్దకు వెళ్లి జీవో నెంబర్ 35 ప్రకారం టికెట్ ధరలు అమ్ముతున్నారా? లేదా? అనేది చెక్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో, ప్రస్తుతం అధికారులంతా “భీమ్లా నాయక్” సినిమా ధియేటర్లకు పయనమయ్యారు.

ఈ టికెట్ ధరలతో “భీమ్లా నాయక్” సినిమాను ప్రదర్శించలేమని చెప్తూ, మాచర్ల వంటి ప్రాంతాలలో ధియేటర్ల ముందు ఛారిటీ బాక్స్ లు పెట్టి పవర్ స్టార్ అభిమానులు కాస్త సహకరించాలని ధియేటర్ల యాజమాన్యం కోరడం జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 35 టికెట్ ధరలు ఏ పాటివో సూచిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాను టార్గెట్ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కన్నా జగన్ కు ‘భీమ్లా నాయక్’ సినిమాను దెబ్బ తీయడం ముఖ్యమైపోయిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.

భారతదేశంలో సినిమా రంగం జోలికి వెళ్లిన వారు ఎవరూ లేరు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీనే తెలుగు సినిమా వెలిగిపోతోందని ప్రస్తావిస్తుంటే, మీరు మాత్రం కక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని జగన్ ను దుయ్యబట్టారు. ఓ పక్కన తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తుంటే, మీరు మాత్రం సినీ రంగాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి రెండు చేతులు జోడించి అర్ధించినపుడైనా మీ మనసు కరగలేదంటే ఇది ఖచ్చితంగా కక్ష్య సాధింపు చర్యే, ఇప్పటికే రాష్ట్రం నాశనం అయిపోయింది. అభివృద్ధి, వ్యవసాయ రంగం, నీటి పారుదల వంటి కీలక అంశాలు వదిలేసి, భీమ్లా నాయక్ షోలు ఎలా నియంత్రించాలి? అన్న వాటిపై దృష్టి పెట్టడం జగన్ పాలనకు తార్కాణంగా సోమిరెడ్డి పేర్కొన్నారు.

ఒక్క సోమిరెడ్డే కాదు, మరో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా “భీమ్లా నాయక్” సినిమాకు బాసటగా నిలుస్తూ, జగన్ సర్కార్ తీరును ఎండకట్టారు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి లాంటి హీరో మీకు వచ్చి దండం పెట్టారంటే, అది ఆయన కష్టపడిన ఇండస్ట్రీ నాశనం అయిపోతుంటే చూడలేక పెట్టారు తప్ప మరొకటి కాదని తీవ్రస్థాయిలో జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

ప్రస్తుతం “భీమ్లా నాయక్” వేదికగా జరుగుతోన్న పరిణామాలు భవిష్యత్తు ఎన్నికలకు సంకేతమా? అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. జనసేనతో మైత్రీపై తాము సుముఖంగానే ఉన్నామని గతంలో చంద్రబాబు కూడా ప్రకటించగా, తాజాగా ‘భీమ్లా నాయక్’ విషయంలో సహకారం అందిస్తూ, మరోసారి తమ భావాలను పంపుతున్నారా? అన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.