TDP- Strengths and weakness“మళ్ళీ అసెంబ్లీలోకి అంటూ అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను” అంటూ వైసీపీ చర్యలకు సవాల్ విసిరి వెళ్లిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తిరిగి సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన శపథం నిరూపించుకుంటారన్న నమ్మకాన్ని నిమ్మల రామానాయుడు తాజాగా వ్యక్తపరిచారు.

ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న నిమ్మల, “తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓడిపోయినా, తిరిగి అధికారంలోకి ఎలా తెచ్చుకోవాలో, మా పార్టీ కార్యకర్తలకు తెలిసినంతగా మరొకరికి తెలియదని” ఎంతో బలంగా చెప్పుకొచ్చారు. టీడీపీ క్యాడర్ ను ఉత్సాహపరుస్తోన్న ఈ వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.

టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రామానాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమే కావచ్చు. ఎందుకంటే వైఎస్సార్ హయాంలో ఉన్నపుడు ‘తెలుగుదేశం పార్టీ ఇక అంతరించిపోయిందని’ చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2014లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం సొంత పార్టీ నేతలకే లేదు. కానీ మళ్ళీ సింహాసనంపై కూర్చోపెట్టిన ఘనత పార్టీ కార్యకర్తలదే.

అలాగే గతంలో వైశ్రాయ్ సంఘటన జరిగిన సమయంలో కూడా టీడీపీ పనైపోయిందన్న ప్రచారం మెండుగా జరిగింది. కానీ అనతికాలంలోనే పార్టీ కోలుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అంత క్యాడర్ ఉండడమే టీడీపీ బలమని, బహుశా ఆ విశ్వాసాన్నే నిమ్మల రామానాయుడు కూడా వ్యక్తపరిచి ఉంటారన్నది చరిత్ర తెలిసిన వారు చెప్తోన్న మాటలు.

అయితే ఇదే సందర్భంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసారు రామానాయుడు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం టీడీపీ కార్యకర్తల బలమైతే, తెచ్చిన అధికారాన్ని ఓ 10, 15 సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగేలా చేసుకోవడంలో టీడీపీ నేతలు ఉండడం లేదని, పార్టీ బలహీనత గురించి కూడా స్పష్టంగా చెప్పేసారు నిమ్మల.

ఇది కూడా నూటికి నూరు శాతం నిజమన్నది టీడీపీ కార్యకర్తల భావన, ఓ రకంగా మనోవేదన కూడా! ఇందుకు ఉదాహరణగా గత ప్రభుత్వ పాలననే చూపుతున్నారు. విభజన జరిగిన తర్వాత ఓ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పడ్డ తపనలో కనీసం 10వ శాతం టీడీపీ నేతలు చూపించినా, నాడు ప్రజల నుండి అంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదనేది స్పష్టం.

వచ్చిన అధికారాన్ని తమ స్వప్రయోజనాల ఎదుగుదలకు వాడుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని, టీడీపీ నేతలు ఇలాంటి తప్పులనే మళ్ళీ మళ్ళీ చేయడం వలన, క్షేత్రస్థాయిలో పార్టీ ఎంత బలంగా ఉన్నా వరుసగా రెండవ సారి అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతున్నారని ఇప్పటికే వివిధ సందర్భాలలో రాజకీయ విశ్లేషకులు తెలిపారు.

ఇదే విషయాన్ని నిమ్మల డేరింగ్ గా చెప్పడం కూడా విశేషం. జరిగిన తప్పులను తెలుసుకుంటేనే నాయకుడిగా ఎదుగుతారు. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ప్రజా క్షేత్రంలో ముందుకు వెళితే, భవిష్యత్తు మరోలా ఉండే ఆస్కారం ఉంటుంది. నిమ్మల చెప్పినట్లు ప్రస్తుతానికి అయితే టీడీపీ తన కార్యకర్తలనే నమ్ముకుంది, వారు విజయాన్ని అందిస్తే, ఈ సారి తప్పుదిద్దుకునేందుకు నాయకులు కూడా సిద్ధంగా ఉన్నట్లే కనపడుతున్నారు.