Dasu-Naidu-Menda-TDP-Srikakulamశ్రీకాకుళం జిల్లాలో టిడిపి నేతలు ‘జాబ్ ఎక్కడ జగన్?’ అంటూ ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసు నాయుడు నేతృత్వంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు నరసన్నపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత తెలుగు యువత, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్ అధ్వర్యంలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గ కేంద్రాలలో వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసు నాయుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మేము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాము. తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని జగన్ పాదయాత్రలో హామీలు ఇచ్చారు. కానీ మూడేళ్ళు గడిచినా ఇంతవరకు నోటిఫికేషన్లు లేవు…ఉద్యోగాలు లేవు.

విద్యావిధానంలో మార్పులు అంటూ ఉన్న పాఠశాలలను మూసివేసి ఉపాధాయ పోస్టులను కుదించారు. ఇంత చదువు చదివి పోనీ ఇస్త్రీ దుకాణమో, కూరల దుకాణమో పెట్టుకొని పొట్ట పోసుకొందామంటే ఎడాపెడా పన్నులు విధిస్తూ స్వయం ఉపాధి కూడా చేసుకోలేని పరిస్థితి కల్పిస్తోంది ఈ జగన్ ప్రభుత్వం. దీని కోసమేనా వైసీపీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది?” అని ప్రశ్నించారు.

ఈ నిరసన కార్యక్రమంలో నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జా బాబూరావు, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.