TDP-Social-Mediaఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతటివాడిని సోషల్ మీడియా గద్దె దించేసిందంటే అది ఎంత శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చాలా కాలం క్రితమే ఇది గ్రహించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. దాని ద్వారానే ప్రజలతో బలమైన సంబందాలు ఏర్పరచుకొంటూ మరోపక్క వైసీపీ పాలనను ఎండగడుతున్నారు.
కానీ నేటికీ టిడిపిలో అతికొద్ది మంది అగ్రనేతలు తప్ప చాలా మందికి సోషల్ మీడియాలో అకౌంట్లు లేవు కనీసం దాని గురించి అవగాహన కూడా లేదు. కనుక వారందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే నమ్ముకొని చాలా వెనకబడిపోతున్నారు.

ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి నాయకుల అధ్వర్యంలో గత రెండు మూడు నెలలుగా బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కానీ వారికి సోషల్ మీడియా, దాని ప్రాధాన్యత, ప్రభావం, పరిధి గురించి అవగాహన లేకపోవడం వలన తమ కార్యకమాల గురించి మర్నాడు న్యూస్ పేపర్లలో చూసుకొని, వాటిలో తమ ఫోటో పడిందో లేదో చూసుకొని పడితే తృప్తి పడుతున్నారు తప్ప తమ కృషి, శ్రమ గురించి పార్టీ అధిష్టానానికి, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియజేయలేకపోతున్నారు. ఒకవిదంగా చెప్పాలంటే టిడిపిలో చాలామంది బావిలో కప్పల్లా గడిపేస్తున్నారు.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న నారా లోకేష్‌, దేవినేని ఉమ, బోండా ఉమా, అనిత వంగలపూడి, అనూష ఉండవల్లి, బీటెక్ రవి వంటి పలువురు నాయకులు ప్రజలలో మంచి గుర్తింపు పొందుతున్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అసమర్దత, అక్రమాలు, లోతుపాట్లను ఎండగడుతూ రాజకీయంగా బలమైన నాయకులుగా మంచి గుర్తింపు పొందుతున్నారు.

ఉదాహరణకు వైసీపీ నేతలకు గడప గడపకి కార్యక్రమంలో ఎదురవుతున్న అగచాట్ల గురించి వారు పెడుతున్న పోస్టులు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే పలు పధకాలు, పనుల గురించి వైసీపీ చెప్పుకొంటున్న గొప్పలను, దాని వాదనలను వారు సాక్ష్యాధారాలతో సహా తప్పని నిరూపించి చూపుతున్నారు.