TDP Social Media2019 ఎన్నికలలో వైసీపీ చేతిలో చావుదెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ, వచ్చే ఎన్నికలలో అయినా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుండి దాదాపుగా సైలెంట్ అయిపోయిన టిడిపి రాజకీయం, గత కొన్ని రోజులుగా బాగా యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత టీడీపీ వింగ్ మొత్తం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది.

దీంతో గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నట్లుగా కనపడుతోంది. పార్టీలోకి ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని, పెద్ద పీట వేసిన పార్టీ అధినేత చంద్రబాబు సైతం తన తప్పులను సవరించుకునే విధంగా ఇటీవల చేసిన ప్రకటనలు పార్టీలో జరుగుతున్న మార్పుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

అలాగే 2014 నుండి 2019 వరకు రాష్ట్రంలో చాలా పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలకు తోడు రాజధానిలో చాలా వరకు నిర్మాణాలు పూర్తి చేయడం, పోలవరం ఓ కొలిక్కి తేవడం వంటి అంశాలు విజయవంతంగా చేసినప్పటికీ, వాటిని ప్రజల్లోకి సరిగా తీసుకుళ్లలేకపోయారు. వాటిని కూడా సరిదిద్దుకునే విధంగా టిడిపి భారీ కసరత్తులే చేస్తోంది.

ప్రస్తుత తరం అంతా సెల్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. అందుకు సోషల్ మీడియా అనేది ప్రధాన ఆయుధం. టిడిపి అధికారంలో ఉన్నపుడు సోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమైందన్నది కాదనలేని వాస్తవం. కానీ ఇపుడు అదే సోషల్ మీడియా వింగ్ ను టిడిపి యాక్టివ్ చేసినట్లుగా కనపడుతోంది.

ప్రస్తుత అధికార పార్టీ చేస్తోన్న తప్పులను హైలైట్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారు. ఆర్ధికంగా రాష్ట్రం కుదేలు కావడం కూడా అధికార పార్టీ పనితీరుకు అద్దం పడుతుండడంతో, అధికారంలోకి రాకమునుపు జగన్ చేసిన వ్యాఖ్యలను, ప్రస్తుత పనితీరును ఎండకడుతూ ఛలోక్తులు విసురుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తోన్న పదజాలాలను వైరల్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

సోషల్ మీడియా అనేది అత్యంత ముఖ్యమైన ప్రచార అస్త్రమని బీజేపీ పదేళ్ల క్రితమే గుర్తించింది. తద్వారానే మోడీ దేశవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయ్యారు. అలాగే గత ఎన్నికలలో వైసీపీ సోషల్ వింగ్ ను అంచనాలకు మించి వినియోగించుకుంది. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనపడింది.

ఆలస్యంగా అయినా తేరుకున్న టిడిపి ప్రస్తుతం సోషల్ వింగ్ ను అలెర్ట్ చేసింది. దీంతో పార్టీ చేస్తోన్న ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు కూడా విరివిగా పాల్గొంటున్నారు. 2014 నాటి పునర్వైభవమే ప్రధాన అజెండాగా సాగుతోన్న ఈ విధానాన్ని మరో రెండేళ్ల పాటు విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై మరియు విధివిధానాలపై ఉంది.