బాగానే చేసినా ఘోరంగా ఓడిపోవడం ఏడాది కావొస్తున్నా తెలుగుదేశం పార్టీకి జీర్ణం కావడం లేదు. నాయకులు కొందరు వేరే పార్టీలలోకి వెళ్ళిపోగా కొందరు ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నారు. నాయకులు ఎలా ఉన్నా ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం చాలా కసి మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనే తమకు నష్టం జరిగిందని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు.

ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే తప్పుదిద్దుకుంటున్నారు. ఇటీవలే #TDPTwitter పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు ఏదో ఒక ట్రెండ్ చేపట్టడంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

అది అలా ఉంచితే ముఖ్యమంత్రి జగన్ నిన్న పెట్టిన ఒక ప్రెస్ మీట్ లో తప్పులని వారు పట్టుకోవడం చూస్తే వారు ఎంత కసిగా ఉన్నారనేది తెలుస్తుంది. గత కొంత కాలంగా తప్పులు దొర్లడంతో జగన్ లైవ్ ప్రెస్ మీట్లు కాకుండా రికార్డు చేసి ఎడిట్ చేసి వీడియోలు వదులుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటికి రుజువులు లేవు.

నిన్న అది కూడా సంపాదించేశారు. వీడియోలో జగన్ వాచ్ లో చూపిస్తున్న టైం, ప్రెస్ మీట్ వచ్చిన టైం ఒకటి కాకపోవడంతో అది రికార్డెడ్ అని నిరూపించేశారు. ఒక ఫ్రేములో జగన్ చేతిలోని గడియారం మధ్యాహ్నం 01:35 అని చూపిస్తోంది. ఇంకో దాంట్లో చూస్తే మధ్యాహ్నం 02:01 గంటలుగా చూపిస్తోంది. అంటే గడియారం లెక్కల ప్రకారం చూస్తే 26 నిమిషాల టైమ్ గ్యాప్ ఉందన్నమాట.

26 నిమిషాల వీడియోలో బయటకు వదిలిన వీడియో 23 నిమిషాలు మాత్రమే. అంటే మిగతా మూడు నిమిషాలు తప్పులను ఎడిట్ చేసినట్టే అంటున్నారు. ఈ రకంగా చిన్న చిన్న విషయాలను కూడా బయటకు తెస్తూ… అధికారపక్షాన్ని ఇరుకున పెడుతున్నారు. పార్టీ నాయకుల కంటే సోషల్ మీడియా తమ్ముళ్లే కసిగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.