TDP should thank Jaganmohan Reddy ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఏడెనిమిది నెలల క్రితం వరకు టిడిపి పని అయిపోయిందనే చాలా మంది భావించారు. టిడిపి ముఖ్యనేతల ఆర్ధిక మూలాలను దెబ్బ తీస్తూ టిడిపి నేతల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే అందుకు కారణం.

అయితే గత ఆరేడునెలల్లో వైసీపీ ప్రభుత్వ పొరపాట్లు, వైఫల్యాలు, సమస్యలు, వివాదాస్పద నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరిగిన అనేక పరిణామాలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తెలివిగా అస్త్రాలుగా మలుచుకొని వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నీలదీయడం మొదలుపెట్టడంతో మళ్ళీ టిడిపి పుంజుకొంది.

వైసీపీ ప్రభుత్వం కుడి చేత్తో పధకాలు ఇచ్చిన్నట్లే ఇచ్చి ఛార్జీలు పెంచేసి మళ్ళీ ఎడమ చేత్తో ప్రజల నుంచి ఆ డబ్బు పిండుకోవడం, జనాలకు సంక్షేమ పధకాలు అలవాటు చేసి వాటిని ఒకటొకటిగా నిబందనలు, ఆంక్షల పేరిట కత్తిరిస్తుండటం ప్రజాగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

అమరావతి రాజధానిని చూడాలని తహతహలాడుతున్న ప్రజల ఆకాంక్షలు గురించకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు జగన్ ప్రభుత్వం సాగిపోతుండటం, రాష్ట్రంలో వరుసగా హత్యలు, అత్యాచారాలు, పదో తరగతి పేపర్ల లీకులు,మాస్ కాపీయింగ్ వంటి పరిణామాలు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వ సమర్ధతపై అపనమ్మకం ఏర్పడటం సహజమే.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకులకు మాజీ మంత్రి నారాయణను బాధ్యుడిని చేస్తూ జగన్ ప్రభుత్వం కేసులు బనాయించడం మరో పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. అప్పటికే తీవ్ర అప్రతిష్ట మూటగట్టుకొన్న జగన్ ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టిడిపి సమర్ధంగా ప్రజలకు చెప్పగలిగింది. ఆ తరువాత పదో తరగతిలో కేవలం 67 శాతం ఉత్తీర్ణత రావడంతో ప్రభుత్వం ఇంకా అప్రదిష్టపాలైంది.

ఈ మద్యలోనే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం, కోనసీమ అల్లర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులలో అసంతృప్తి ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. ఇవే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలలో విముఖత, టిడిపి పట్ల ఆదరణ పెరిగేందుకు కారణం అయ్యాయని అర్ధమవుతోంది.

అయితే అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకొంటూ టిడిపి చేసిన అలుపెరుగని పోరాటాలు కూడా ఆ పార్టీని మళ్ళీ నిలబెట్టాయని చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినప్పటికీ ఒంగోలులో మహానాడు అట్టహాసంగా నిర్వహించడం, దానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తెలుగుదేశం శ్రేణులు తరలిరావడంతో టిడిపిలో, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, పార్టీ నేతలలో నూతనోత్సాహం మొదలైంది.

అదే ఊపులో చోడవరంలో మినీ మహానాడు, విజయనగరంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌ షోలు విజయవంతం అవడంతో టిడిపి నేతలు, కార్యకర్తల కళ్ళలో మళ్ళీ ఆనాటి ఉత్సాహం, సంతోషం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ తీసి మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం ఇప్పుడు టిడిపిలో ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

కనుక వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలతో మళ్ళీ తమకు ఊపిరి ఊది ప్రాణం పోసి పోరాడేస్థాయికి తెచ్చి నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సిఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ మంత్రులు, నేతలకు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.