TDP-SC-Cell-President-MS-Rajuసిఎం జగన్మోహన్ రెడ్డి తాను మీట నొక్కి సంక్షేమ పధకాలకు డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పుకొంటుంటే, అవి వైసీపీ సానుభూతిపరులకు మాత్రమే వెళుతున్నాయని, రాష్ట్రంలో చాలామంది దళితులకు ఎటువంటి సంక్షేమ పధకాలు అందడంలేదని టిడిపి ఎస్సీ సెల్ వాదిస్తోంది.

టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు నేతృత్వంలో మంగళవారం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద దళిత ఘర్జన పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించాలనుకొన్నారు. పది రోజుల క్రితమే దీని గురించి పోలీసులకు సమాచారమిచ్చి అనుమతి కూడా తీసుకొన్నారు. కానీ నిన్న రాత్రి నుంచి విజయవాడలోని టిడిపి నేతలను, పార్టీ కార్యకర్తలను పోలీసులు గృహనిర్బందం చేస్తూ ఎవరూ దళిత గర్జన నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకొన్నారు. దళిత ఘర్జన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. విజయవాడలోని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటి చుట్టూ సోమవారం రాత్రి నుంచే భారీగా పోలీసులు మోహరించి ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకొన్నారు.

కానీ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు నేతృత్వంలో కొందరు ధర్నాచౌక్ వద్దకు చేరుకొని పోలీసుల వలయాన్ని ఛేదించుకొని అక్కడే ఉన్న నీళ్ళ ట్యాంకుపైకి ఎక్కి ధర్నా చేశారు. పోలీసులు కూడా పైకి ఎక్కి వారిని బలవంతంగా కిందకు దింపి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “రాష్ట్రంలో దళితులందరికీ సంక్షేమ పధకాలు ఇస్తున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెపుతూ మోసగిస్తున్నారు. అందుకే మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలపాలనుకొని పోలీసులను అనుమతి కోరితే ముందు ఒప్పుకొన్నారు. కానీ అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాక ఇప్పుడు చివరి నిమిషంలో అనుమతి లేదని చెపుతున్నారు. దళితులకు సంక్షేమ పధకాలు ఇవ్వాలని కోరితే దళితులను అరెస్ట్ చేయించడం ఏం న్యాయం?”అని ప్రశ్నించారు.

తాము ఇస్తున్న సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారని మళ్ళీ జగనన్నే అధికారంలోకి రావాలని కొరుకొంటున్నారని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా గర్వంగా చెప్పుకొంటున్నారు. కానీ టిడిపి ఎస్సీ సెల్ నిర్వహించే ఈ చిన్నపాటి ధర్నాను చూసి జగన్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?అంటే అర్ధం ఏమిటి?