TDP Revenge on Ys Jaganకాలం ఎల్లప్పుడూ ఒకరి వైపే ఉండదు. నాడు అధికారంలో ఉన్న టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోపెట్టింది, అలాగే నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అందలమెక్కించింది. ఇలా కాలానుగుణంగా మార్పులు సహజం. ఆ క్రమంలోనే నాడు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను డ్యామేజ్ చేసిన వైసీపీకి నేడు అదే రంగు, రుచి, వాసన చూపించే క్రమంలో టీడీపీ అడుగులు పడుతున్నాయి.

చంద్రబాబు తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన నారా లోకేష్ ప్రసంగాలలో అప్పట్లో భాష ఉచ్చారణ తప్పులు చాలా దొర్లేవి. వాటిని ఒకటికి వంద సార్లు తమ సొంత మీడియాలలో ప్రసారం చేసి, అలాగే మేమ్స్ చేసి సోషల్ మీడియా జనులకు చేరువ చేయడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఒకానొక దశలో అయితే సొంత పార్టీ నేతలే లోకేష్ ప్రసంగాలలో తెలుగు భాష ఉచ్ఛారణను తీరు చూసి పెదవి విరిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కాలక్రమేణా తనలోని తప్పులను సరిదిద్దుకుంటూ ప్రస్తుతం ఒక సమర్ధవంతమైన ప్రసంగాన్ని నారా లోకేష్ అందించగలుగుతున్నారు. అయితే నాడు లోకేష్ చేసిన ప్రసంగాలను మించిపోయే విధంగా నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుకుతున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరూ కలిసినా మాట్లాడుకునే అంశాలలో “సీఎం గారి తెలుగు భాష ఉచ్చారణ” కూడా ఒకటిగా చేరిపోయింది.

అంతలా తన ప్రసంగాలలో తప్పులను పలుకుతూ తెలుగుదేశం పార్టీకి మంచి మంచి అవకాశాలను అందిస్తున్నారు. నాడు లోకేష్ ను ‘పప్పు’ అన్న పేరుతో ప్రచారం చేసి వైసీపీ ప్రజల్లోకి తీసుకువెళ్లగా, నేడు తెలుగుదేశం జగన్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా అభివర్ణిస్తూ, తెలుగు భాష పలకడంలో దొర్లే తప్పులను ‘జ్ఞానగుళిక’లుగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ చాలా విస్తృతంగా పనిచేస్తోంది.

జగన్ గనుక పబ్లిక్ సమావేశానికి వచ్చి మాట్లాడితే, అందులో తక్కువలో తక్కువ ఓ పది నుండి ఇరవై వరకు తప్పులను పలుకుతున్నారు. వాటన్నింటిని క్రోడీకరించి వినోదభరితమైన మేమ్స్ తో ఓ వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే… లోకేష్ పై నాడు వైసీపీ రిలీజ్ వేసిన వీడియోలకు ప్రస్తుతం టీడీపీ రివేంజ్ తీర్చుకున్నట్లవుతోంది. సోషల్ మీడియా జనులు కూడా పార్టీలకతీతంగా ఇలాంటి హిలేరియస్ వీడియోలకు ఎప్పుడూ నీరాజనాలు పలుకుతుంటారు.

ఒక్క జగన్ మోహన్ రెడ్డి విషయంలోనే కాదు వైసీపీ నాయకులలో ఎక్కువ శాతం మంది ఇలాగే మాటలను తడబడుతూ ప్రసంగిస్తుండడంతో, వాటిని తెలుగుదేశం నేతలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో నారా లోకేష్ అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి వాటికి బలైన వ్యక్తిగా ఆ ప్రభావం ఏమిటో పూర్తిగా తెలిసిన నారా లోకేష్, వైసీపీ నేతలు ఇస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.