Telangana Electionsతెలంగాణాలో అస్తిత్వం కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ తన భావజాలాన్ని కూడా పక్కన పెట్టి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ కూడా మునిగింది. అయితే ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలలో కోసం సన్నద్ధం అవుతుంది. పోటీచేయాల్సిన వార్డులు, అభ్యర్థుల ఖరారు బాధ్యతలన్నీ స్థానిక నియోజకవర్గ ఇన్ ఛార్జులకు అప్పగించారు.

బలమున్నచోటే పోటీచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జి పదవి ఖాళీగా ఉంటే లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ఎక్కడైనా ఇతర పార్టీలు స్థానిక పరిస్థితుల ఆధారంగా మద్దతు కోరితే అక్కడి బలాబలాలను బట్టి నిర్ణయించుకోవాలన్నారు.

అదే సమయంలో ఇతర పార్టీల కండువాలు కప్పుకొని తెదేపా శ్రేణులు ప్రచారానికి వెళ్లరాదని పార్టీ నిర్ణయించడం విశేషం. ఒంటరిగా పోటీచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదే సమయంలో రాష్ట్ర కార్యాలయం నుంచి ఎన్నికల పర్యవేక్షణకు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.

ఈ వ్యూహం వల్ల ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా వచ్చే ఎన్నికల నాటికు పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపించే స్థాయికి ఎదుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం కోల్పోవడంతో చంద్రబాబు నాయుడుకు సైతం తెలంగాణ లో పార్టీపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకనుంది.