Nara-Lokesh-Yuva-Galam-Padayatraటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర రెండో రోజున కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని నలగామపల్లి గుండా సాగుతోంది. ఎప్పటిలాగే వేలాదిమంది పార్టీ కార్యకర్తలు వెంటనడుస్తుండగా నారా లోకేష్‌ ముందుకు సాగుతున్నారు. దారిలో స్థానికులకి అభివాదం చేస్తూ అక్కడక్కడ ఆగి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కురుబా, వాల్మీకి వర్గాల కోసం నిర్మిస్తున్న సామాజిక భవనాలని నారా లోకేష్‌ పరిశీలించారు. వాటి నిర్మాణాలు ఎందుకు నిలిచిపోయాయని స్థానికులని అడిగి తెలుసుకొన్నారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలని తమ ప్రభుత్వమే ఆదుకొంటోందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటారు. కానీ వారి కోసం మొదలుపెట్టిన ఈ రెండు సామాజిక భవనాలని సైతం పూర్తి చేయకుండా అర్దాంతరంగా వదిలేశారు. ఎందుకు? వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు మాటలతో అందరినీ మభ్యపెట్టాలని ప్రయత్నిస్తుంటారని చెప్పడానికి ఈ భవనాలే నిదర్శనం.

సామాజిక న్యాయం గురించి మాట్లాడే సిఎం జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో ఉండే నలుగురూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. వైసీపీలో బీసీ నేతలందరూ తాడేపల్లి ప్యాలస్ బయటే ఉండిపోతుంటారు. ఇదే… వైసీపీ చెప్పుకొనే గొప్ప సామాజిక న్యాయం. కనుక బీసీ ప్రజలు, వారి నాయకులు వైసీపీ నేతల చేతిలో మోసపోతున్నామని గ్రహించాల్సిన అవసరం ఉంది. టిడిపి మాత్రమే అన్ని వర్గాల ప్రజలని సమానంగా గౌరవించి ఆదరిస్తుంది,” అని అన్నారు.

నారా లోకేష్‌ మరికొద్ది సేపటిలో కలమలదొడ్డి క్యాంప్ సైట్‌కి చేరుకొని భోజనం చేసిన తర్వాత స్థానిక పార్టీ నేతలతో సమావేశమవుతారు. మళ్ళీ 3 గంటలకు పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 6.45 గంటలకి శాంతిపురం చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.