TDP-Nara-Lokesh-Yuva-Galam-Padayatra-Kadapaవైసీపీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. కనుక అది వైసీపీకి కంచుకోట. ఆ కోటలోకి టిడిపి నేతలు అడుగుపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అక్కడ ఎవరైనా జగన్‌ భజన చేసేందుకు మాత్రమే నోరు విప్పాలి తప్ప విమర్శించడానికి కాదు!

కనుక సింహం బోను వంటి ఆ వైసీపీ కంచుకోటలోకి టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కోసం ప్రవేశిస్తున్నపుడు, టిడిపి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందే ఉంటారు. కానీ నారా లోకేష్‌ మాత్రం కాదు. ఆయన నిర్భయంగా వైసీపీ కంచుకోటలో ప్రవేశిచడమే కాదు హూ కిల్డ్ బాబాయ్?అంటూ వివేకా, జగన్‌ల ఫోటోలు ముద్రించిన ప్లకార్డులను నడిరోడ్డుపై నిలబడి ప్రదర్శించి నిలదీశారు.

కడపలో అడుగడుగునా బాబాయ్-అబ్బాయ్ కధ చెపుతూనే ఉన్నారు. ఆనాడు తండ్రి చనిపోయినప్పుడే ఆయన శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన విషయాన్ని నారా లోకేష్‌ కడప గడపలోనే మరోసారి గుర్తుచేశారు. తర్వాత బాబాయ్‌ని లేపేశాడని, ఆ తర్వాత తల్లిని చెల్లినీ బయటకు తరిమేశాడని, అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ప్రజలను ఏవిదంగా ఆదరిస్తారని నారా లోకేష్‌ ప్రశ్నినించారు.

చీకట్లో తనపై కోడిగుడ్లు విసిరించే నీచమైన స్వభావం కలిగిన వ్యక్తి ఉన్నతంగా ఎలా ఆలోచించగలడని నారా లోకేష్‌ ప్రశ్నించారు. నేను నీ కడప కంచుకోటలో నిలబడే మాట్లాడుతున్నాను. దమ్ముంటే ధైర్యంగా వచ్చి మాట్లాడాలని నారా లోకేష్‌ సిఎం జగన్మోహన్ రెడ్డికి సవాలు విసరడం మామూలు విషయంగా చూడాలేము.

ఇవన్నీ ఒక ఎత్తైతే, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తానని జగన్ ప్రభుత్వం అంటుంటే టిడిపి ఎందుకు అడ్డుపడుతోందని రాయలసీమ జిల్లాల ప్రజలు నారా లోకేష్‌ను అడుగడుగునా ప్రజలు గట్టిగా నిలదీస్తారనుకొంటే నీరాజనాలు పడుతున్నారు! మరీ ముఖ్యంగా కడప జిల్లాలో ప్రజలు నారా లోకేష్‌కు బ్రహ్మరధం పడుతుండటం గమనిస్తే వారు కూడా వైసీపీ పాలన, అరాచకాలాతో విసుగెత్తిపోయి ఉన్నారని, మార్పు కోరుకొంటున్నారని అర్దం అవుతోంది.

రాయలసీమ జిల్లాలలో, ముఖ్యంగా కడపలోనే ఇంత గొప్ప స్పందన వస్తుంటే టిడిపికి బలం, మంచి జనాధారణ ఉన్న ప్రకాశం జిల్లా మొదలు అటు శ్రీకాకుళం జిల్లావరకు నారా లోకేష్‌ చేయబోయే యువగళం పాదయాత్రకు మరెంత గొప్పగా సాగబోతోందో ఊహించుకోవచ్చు.

ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడైనా తమకు అత్యంత అనుకూలమైన జిల్లా లేదా నియోజకవర్గం లేదా ప్రాంతాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టుకొంటారు. కానీ నారా లోకేష్‌ రాయలసీమ జిల్లాల నుంచే యువగళం పాదయాత్ర ప్రారంభించి తిరుగులేదనిపించుకొన్నారు.

నారా లోకేష్‌ నిన్న 117వ రోజు యువగళం పాదయాత్రలో కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో ఆలంఖాన్ పల్లెలో 49వ డివిజన్‌ వద్ద 1,500 కిమీ మైలు రాయిని అధిగమించారు. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప పట్టణంలో డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని దానిలో లిఖింపజేశారు.