Nara_Lokesh_Yuva_Galam_Padayatra_Effectటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర వలన టిడిపికి ఒరిగేదేమీలేదని ముందే తేల్చి చెప్పేసిన వైసీపీ నేతల నోళ్ళు మూతపడ్డాయి. యువగళం పాదయాత్ర ప్రభావం రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్పష్టంగా కనబడుతోంది. ఈ ఎన్నికలలో వైసీపీ నేతలు వాలంటీర్లను రంగంలో దింపి, పదో తరగతి ఫెయిల్ అయినవారిని గ్రాడ్యుయేట్లగా చూపించి దొంగఓట్లు వేయించి ఎన్నో అవకతవకలకు పాల్పడింది. కనుక పశ్చిమ రాయలసీమలో వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్ర రెడ్డి అవలీలగా భారీ మెజార్టీతో గెలిచి ఉండాలి. కానీ శనివారం సాయంత్రం 5 గంటలకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా వెనకబడిపోయారు. టిడిపి బలపరిచిన అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి 400 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నారాలోకేష్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మొదట అభ్యర్థులను, తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టారు. చివరికి దొంగ ఓట్లు సృష్టించి… 6,7వ తరగతి చదివిన వాళ్లతో పట్టభద్రుల ఓట్లను వేయించారు. కానీ డబ్బు బలం, అధికార బలం, అవినీతి బలం… ఏవీ కూడా ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. జగన్ మీదున్న అసంతృప్తిని చల్లార్చ లేకపోయాయి మూడు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందంటే దానర్థం… ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో మార్పుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు శ్రీకారం చుట్టాలని మేము ప్రజలని అడిగాం. వాళ్ళు తమ నిర్ణయాన్ని ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారు,” అని అన్నారు.

మూడున్నరేళ్ళు శ్రమపడి మూడు రాజధానులతో రాయలసీమను వైసీపీ కంచుకోటగా మార్చేసుకొన్నామని సంబరపడుతుంటే, దానిని నారా లోకేష్‌ 45 రోజుల పాదయాత్రతో బద్దలు కొట్టారు. అంటే నారా లోకేష్‌ యువగళం గట్టిగానే వినిపించిన్నట్లే కదా?

ఈ 45 రోజులలో నారా లోకేష్‌ 500 కిమీ పాదయాత్ర పూర్తి చేయడమే కాకుండా జగన్ ప్రభుత్వానికి తన తండ్రి చంద్రబాబు నాయుడు పాలనకు గల తేడాను చక్కగా వివరిస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. తమది నిర్మాణాత్మక ప్రభుత్వమైతే జగన్ ప్రభుత్వం విధ్వంసకర ప్రభుత్వమని సెల్ఫీ ఫోటోలతో కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అసమర్దత, అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ దుస్థితికి చేరుకొండని ఉదాహరణలతో సహా వివరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. టిడిపి వస్తే రాష్ట్రాన్ని మళ్ళీ ఏవిదంగా గాడిన పెట్టి పరిస్థితులు చక్కదిద్దవచ్చో కూడా చెపుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు భవిష్యత్‌ మీద నమ్మకం కలిగిస్తున్నారు.

పాదయాత్రలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఏవో ఊకదంపుడు ఉపన్యాసాలు, హామీలు ఇవ్వకుండా తాను చేయగలనన్నుకొన్నవే చెపుతున్నారు. ప్రతీ 100 కిమీ పాదయాత్ర పూర్తిచేసినప్పుడు ఆ గ్రామానికి తాను ఇచ్చిన హామీలను శిలాఫలకం మీద రాయిస్తూ ప్రజల నమ్మకం పొందుతున్నారు.

నారా లోకేష్‌ మాటలలో నిజాయితీ, నడవడికలో ప్రజల పట్ల ప్రేమ, గౌరవం ప్రస్పుటంగా కనిపించాయి కనుకనే ప్రజలు ఆయన వెంటనడుస్తూ జేజేలు పలుకుతున్నారు. ప్రజల ఆలోచనలలో వచ్చిన ఈ మార్పే నేడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రస్పుటంగా కనిపించింది.

నారా లోకేష్‌ 45 రోజుల యువగళం పాదయాత్రతో టిడిపికి ఈ తొలి విజయం లభించినప్పుడు, ఆయన ఏడాదిపాటు ఏకధాటిగా శ్రీకాకుళం వరకు పాదయాత్ర పూర్తిచేస్తే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఈ ప్రభావం తప్పక ఉంటుంది కదా?గత ఎన్నికలలో ఐ-ప్యాక్ కుట్రలకు బలైపోయిన నారా లోకేష్‌ ఈసారి దానికి కూడా తగిన బుద్ధి చెప్పబోతున్నారు. ఆయన సమర్ధతని తక్కువగా అంచనా వేసినందుకు వైసీపీ చింతించకా తప్పదు.