Yuva_Galam_Nara_lokeshటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ కుప్పం నుంచి మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో నేడు 7వ రోజు విజయవంతంగా సాగుతోంది. బుదవారం పలమనేరు నియోజకవర్గంలో రామాపురం నుంచి 6వ రోజు పాదయాత్ర ప్రారంభించి దారిలో సాకేపూరు, బేలుపల్లి, పిచ్చి గుంట్లపల్లి, రామాపురం వరకు మొత్తం 13.8 కిమీ పాదయాత్ర చేశారు. దారిలో నారా లోకేష్‌ చెరుకు రైతులు, పాడి రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఎస్సీ వర్గం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకొంటూ ముందుకు సాగారు. నారా లోకేష్‌ ఇప్పటి వరకు మొత్తం 72.3 కిమీ పాదయాత్ర చేసి నేడు 7వ రోజున పలమనేరులో రామాపురంలో ఎమ్మోస్ హాస్పిటల్‌ వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ముందుగా స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులతో సెల్ఫీలు దిగారు.

దారిలో ఆర్యవైశ్య పెద్దలని కలిసి నారా లోకేష్‌ వారి ఆశీర్వాదాలు తీసుకొన్నారు. స్థానిక వైసీపీ నేతల నుంచి తాము నిరంతరం తీవ్రమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ వ్యాపారాలు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు నారా లోకేష్‌కి తెలియజేశారు. వైసీపీ నేతల వేధింపులు భరించలేక కొంతమంది వ్యాపారాలు మూసుకొంటే, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్‌ వారి సమస్యలన్నీ ఓపికగా విన్నాక టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ని పునరుద్దరించి ఆర్యవైశ్యులకు అన్ని విదాలా తోడ్పడతామని చెప్పారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత నారా లోకేష్‌ సమక్షంలోఎమ్.సి. పాలెంకు చెందిన 20 మంది యువయువకులు, రంగాపురానికి చెందిన 20 కుటుంబాలు, పలమనేరు పట్టణం పెద్దమసీదు వీధికి చెందిన 20 ముస్లిం కుటుంబాలవారు, మాజీ సర్పంచ్ తదితరులు టీడీపీలో చేరారు.

నారా లోకేష్‌ వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు వారందరి సమస్యలు తప్పకుండా తీర్చుతానని నారా లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు.