టిడిపి యువనాయకుడు నారా లోకేష్ జనవరి 27వ తేదీన కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన రోజు నుంచే వైసీపీ నేతల ఆక్రందనలు, పిల్లి శాపాలు మొదలుపెట్టేశారు. నేటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. యువగళం పాదయాత్రతో ఒరిగెదేమీ లేదంటూనే నారా లోకేష్‌ని పోలీసులతో అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత 14 రోజులలోనే ఆయనపై 5 కేసులు నమోదు చేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా యువగళం పాదయాత్రకి పెద్దగా స్పందన కనిపించడం లేదంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. రాంగోపాల్ వర్మ కూడా వైసీపీకి వంతపాడుతూ ‘నారా లోకేష్‌కి నా ఉచిత చచ్చు సలహాలు’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు.
ఇదంతా చూస్తుంటే, ఓ ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తే అధికార పార్టీకి ఎందుకు అంత అక్కసు?అని సందేహం కలుగుతుంది. ఆనాడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఆ పాదయాత్రని అడ్డుకోలేదు. ఎందుకంటే, రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షాలకి ర్యాలీలు, సభలు, పాదయాత్రలు చేసుకోవడానికి హక్కు కలిగి ఉంటాయని నమ్మింది కనుక రాజ్యాంగానికి కట్టుబడింది. పోలీసులు కూడా ఆయనని ఎక్కడా అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. ఆయన పాదయాత్ర సజావుగా సాగేందుకు ఎంతగానో సహకరించారు కూడా.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో టిడిపి ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేసేవారు. వాటికి టిడిపి నేతలు ధీటుగా జవాబులు ఇచ్చేవారు. టిడిపి ప్రభుత్వం అంతవరకే పరిమితమైంది తప్ప తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే కోపంతో ఎటువంటి జీవోలు తేలేదు. జగన్‌ని అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. ఇదే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తుచేసి ఆనాడు మా ప్రభుత్వం వద్దనుకొంటే మీరు ఒక్క అడుగు వేయగలిగేవారా? ప్రశ్నిస్తున్నారు.
కానీ కక్ష సాధింపే వైసీపీ విధానంగా ఉన్నందున నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూనే ఉంది. నారా లోకేష్ వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన తన పాదయాత్రతో వైసీపీకి మంచి ప్రచారం చేస్తున్నారని నిన్న ఓ వైసీపీ నేత గొప్పగా చెప్పుకొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర వలన టిడిపికి కంటే తమ పార్టీకే ఎక్కువ ప్రయోజనమని చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? నారా లోకేష్ యువగళం పాదయాత్ర విఫలం అవ్వాలని ఎందుకు కోరుకొంటోంది?
పాదయాత్రలో వేలాదిమంది జనం పాల్గొనప్పుడు ‘అదంతా డ్రోన్ కెమెరా మాయ’ అని వాదిస్తుంటారు. పాదయాత్రలో ఎక్కడైనా జనం కాస్త పలచగా కనిపిస్తే ‘చూశారా… చూశారా… నారా లోకేష్ పాదయాత్రకి అసలు స్పందనే లేదు…’ అని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టి కామెంట్స్ చేస్తుంటారు.
నాలుగు వందల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదనే సంగతి ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేసిన వైసీపీ అధినేతకి తెలిసే ఉంటుంది. తన పార్టీ నేతలు, సోషల్ మీడియాలో పనిగట్టుకొని నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఈవిదంగా దుష్ప్రచారం చేస్తుంటే, పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతుంటే ఎందుకు వారించడం లేదు?వైసీపీ ఇంత దిగారిపోవలసిన అవసరం ఉందా? ప్రతిపక్షాలతో ఈవిదంగా వ్యవహరిస్తూ ప్రజలకి ఏం సందేశం పంపుతున్నారు?