టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 450 రోజులపాటు ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఆ రోజు ఉదయం చిత్తూరు జిల్లా, కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి పాదయాత్ర మొదలుపెడతారు. కుప్పం నియోజకవర్గంలోనే ఆయన మూడు రోజులు పాదయాత్ర కొనసాగుతుంది.
నారా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్‌ని టిడిపి త్వరలోనే ప్రకటించనుంది. ఈ పాదయాత్ర కోసం టిడిపి నేతలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి, జనసేన నేతలని వైసీపీ నేతలు, కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకొంటూ భౌతిక దాడులు కూడా చేస్తున్నందున నారా లోకేష్ భద్రత కోసం టిడిపి మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకొంటోంది. పార్టీ కార్యకర్తలు తోడున్నప్పటికీ, ఈసారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం చాలా అవసరమని టిడిపి నేతలు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకొనేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్: 1పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించినప్పటికీ, ఒకవేళ హైకోర్టు స్టే ఎత్తివేస్తే దానిలో షరతుల సాకుతో నారా లోకేష్‌ని ముందుకు సాగనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు తప్పక ప్రయత్నిస్తారు. కనుక ఆ కోణంలో నుంచి కూడా టిడిపి నేతలు ఆలోచించి, అటువంటి పరిస్థితే ఎదురైతే వెంటనే హైకోర్టుని ఆశ్రయించి నారా లోకేష్ పాదయాత్రకి అనుమతి తెచ్చుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలని మార్చిలోగా పూర్తి చేసి వారాహితో యాత్రకి బయలుదేరబోతున్నారు. కనుక ఒకేసారి రెండు పార్టీల నేతలు యాత్రలు చేయడం మొదలుపెడితే ఇక నుంచి అధికార, ప్రతిపక్షాల మద్య విమర్శలు ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం ఇంకా పెరుగుతుంది.
నారా లోకేష్ రాష్ట్రంలో ఎన్నికల గంట మ్రోగే వరకు పాదయాత్ర కొనసాగిస్తూ శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో భారీ బహిరంగసభతో ముగిస్తారు.