nara-lokesh-tdp-andhra-pradeshఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తన చరిత్రలోనే ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది టీడీపీ. జగన్ వేవ్ లో తెలుగుదేశం పార్టీ టీడీపీ కంచుకోటలు కూడా కొట్టుకుపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి నారా లోకేష్ కూడా దారుణమైన ఓటమి మూటగట్టుకున్నారు. గత ఎన్నికలలో కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచినా ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఈ సారి ఏకంగా 5000 పైచిలుకు ఓట్లతో నారా లోకేష్ మీద గెలిచారు.

దీనితో రాజీనామా చెయ్యకుండా ఉంచుకున్న ఎమ్మెల్సీ పదవిలోనే లోకేష్ కంటిన్యూ అవుతున్నారు. ఓటమితో ఆయన రాజకీయ ప్రస్థానం మీద నీలి నీడలు అలముకున్నాయి. వచ్చే ఐదేళ్ళలో తనని తాను నిరూపించుకుంటేనే రాజకీయంగా ఆయన అస్తిత్వం నిలబడుతుంది. లోకేష్ ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ ఆయన వాడిన ఛాంబర్ మీద కూడా పడింది. అనేక కీలక శాఖలు నిర్వహించిన ఛాంబర్ ను సెంటిమెంట్ గా తీసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులెవరూ ముందుకు రాలేదు.

ముఖ్యమంత్రి ఛాంబర్ తరువాత విశాలమైనది సకల సదుపాయాలు కలిగిన ఈ ఛాంబర్ ను కూడా ఎవరూ కావాలనుకోవడం లేదు. కొత్త మంత్రులు కూడా వద్దు అనుకోవడంతో ఈ ఛాంబర్ ను ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఛాంబర్ గా ఇచ్చేసింది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది. రెండు ఛాంబర్లు పక్కపక్కనే ఉండటంతో వారికి సదుపాయంగానే ఉందని టీడీపీ వారు సరిపెట్టుకుంటున్నారు