Nara_Lokesh_Yuva_Galamటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం పోలీసుల అనుమతి కోరుతూ టిడిపి నేతలు చిత్తూరు ఎస్పీకి దరఖాస్తు చేసుకొన్నప్పటికీ అనుమతివ్వకపోవడంతో టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామాయ్య శనివారం డిజిపికి లేఖ వ్రాశారు. పాదయాత్ర తేదీ దగ్గర పడుతున్నందున తక్షణం అనుమతి మంజూరు చేయాలని ఆ లేఖలో కోరారు. అయితే ఆయన దానికి బదులిస్తూ, పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు?వారి ఆధార్ కార్డ్ కాపీలు, అలాగే పాదయాత్రలో పాల్గొనే వాహనాల వివరాలు, జిల్లాల వారీగా నిర్వాహకుల వివరాలు వగైరా ఇవ్వాలని కోరుతూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి లేఖ వ్రాశారు.

దానికి వర్ల రామయ్య ఘాటుగా బదులిస్తూ, “నేటి నుంచి రాబోయే 12 నెలల్లో ప్రతీరోజూ మీ కార్యాలయానికి ఎంతమంది వస్తారు?ఎన్ని వాహనాలు వస్తాయి?వాటి వివరాలు ఇవ్వగలరా?”అంటూ ప్రశ్నించారు. అది చెప్పడం సాధ్యం కాన్నట్లే నారా లోకేష్‌ పాదయాత్ర ఏడాది షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవ్వలేమని వర్ల రామయ్య తెలియజేశారు. ఒకవేళ ఏదో కారణంతో నారా లోకేష్‌ని పాదయాత్రకి అనుమతించకపోయినా తప్పకుండా చేస్తారని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

దానిపై డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించలేదు కానీ చిత్తూరు ఎస్పీ స్పందిస్తూ పాదయాత్రకి అనుమతిస్తున్నట్లు చిత్తూరు టిడిపి నేతలకి తెలియజేశారు. అయితే పాదయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, నిబందనలకి లోబడే పాదయాత్ర చేసుకోవాలని సూచించారు.

దీంతో నారా లోకేష్‌ సుదీర్గ పాదయాత్ర తొలి ఆటంకం తొలగిపోయింది. జనవరి 27 మధ్యాహ్నం నారా లోకేష్‌ స్థానిక దేవాలయంలో పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోనే మూడు రోజులపాటు పాదయాత్ర సాగుతుంది. కుప్పం నుంచి 400 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల గుండా 4,000 కిమీ పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగిస్తారు.

ఇది వరకు పాదయాత్రకు దారి పొడవునా ఏర్పాట్లు చేసుకొంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నారా లోకేష్‌పై వైసీపీ శ్రేణులు దాడులు చేయవచ్చని టిడిపి నేతలు అనుమానంగా ఉన్నారు. కనుక భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.