TDP Nama -Nageswara Rao joins TRSనిన్నటివరకు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబెర్, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆయన గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ తరఫున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

నామాను పార్టీలోకి తేవడంతో ఆయన బద్ద విరోధి, ఆయనను వ్యతిరేకించి టీడీపీ నుండి తెరాస లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోతున్నారని సమాచారం. తుమ్మలను పార్లమెంట్ కు పంపిస్తారని ఒక సమయంలో బాగా చర్చ నడిచింది. ఈరోజు పార్టీలో చేరిన నామా ఈరోజు ప్రకటించనున్న తెరాస ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉండటం విశేషం. దీనిని తెరాస అభిమానులు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉండి కూడా ఇంతకు దిగజారాలా అని వారు పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.

నామా వంటి చంద్రబాబు తొత్తుని పార్టీలో చేర్చుకోవడమే ఎక్కువ అటువంటిది ఆయనకు టిక్కెట్ ఇవ్వడమేంటి అని వారి వాదనగా ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోను గత ఎన్నికలలో తెరాస భారీ విజయం సాధించినా ఖమ్మంలో కేవలం ఒకే ఒక్క స్థానము గెలిచింది. కాంగ్రెస్ ఆరు, టీడీపీ రెండు, ఒక్క స్వతంత్రుడు గెలిచారు. కాంగ్రెస్ నుండి జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కారు ఎక్కినా జిల్లాలో మొత్తంగా కాంగ్రెస్, టీడీపీలను ఖాళీ చెయ్యాలని తెరాస భావిస్తుంది.