TDP MPs fight on Railway zoneపార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో విశాఖ రైల్వే జోన్‌ పై కేంద్ర మంత్రిని టీడీపీ ఎంపీలు నిలదీశారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. సభలో అందరి ముందు ఇస్తామని చెబుతున్నారని, కోర్టులో మాత్రం ఇచ్చేది లేదు పొమ్మంటున్నారని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇటీవల రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విభజన చట్టం అమలుపై సుప్రీంలో దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్‌లో రైల్వే జోన్ ఇవ్వడం కుదరదని చెప్పారని అవంతి పేర్కొన్నారు. ఎందుకిలా రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను టీడీపీ ఎంపీలు రైల్వే జోన్‌పై నిలదీశారు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ రైల్వే జోన్ గురించి ప్రశ్నిస్తూ వచ్చారు. ఇచ్చిన వాగ్దానాన్ని మరిచారని పేర్కొన్నారు. నాలుగేళ్లు ఎదురు చూశామని, ఇక తమ వల్ల కాదని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను చిన్నచూపు చూస్తున్నారని, తొలుత జోన్ గురించి మాట్లాడాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.