TDP MP Pandula Ravindra Babu joins ysrcpతూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు ఈరోజు ఉదయం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో సోమవారం భేటీ అయి పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఒక వార్తా ఛానల్ తో మాట్లాడారు. టీడీపీ తనకు ఈ సారి అమలాపురం టిక్కెట్టు నిరాకరించిందని, ఏదైనా ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వమన్నా స్పందించలేదని అందుకే పార్టీ మారుతున్నట్టు చెప్పారు.

అయితే కండువా కప్పకా విజయసాయి రెడ్డి ఆయనను పక్కకు తీసుకుని వెళ్లి తల అంటేశారంట. అసలు ఎలా మాట్లాడాలో తెలీదా అని చెప్పి చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడాలని గీతోపదేశం చేశారట. దీనితో రవీంద్ర బాబు లోటస్ పాండ్ బయట ఉన్న మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదు.. ఓటుకు నోటు కేసుకు భయపడి అమరావతి పారిపోయారు అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఇచ్చిన స్పీచ్ చదివి వినిపించేశారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావన్నారు. ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మేలు చేస్తోందని ఆరోపించారు.

తనకు టీడీపీ ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతోనే వైకాపాలో చేరుతున్నాననేది అబద్దమని కొట్టిపారేశారు. అక్కడ ఉన్న మీడియా ఉదయం ఇచ్చిన స్టేట్మెంటు గురించి ఎత్తగా మాట దాటేశారు. రవీంద్ర బాబును ఇటీవలే పార్టీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ వెంట తీసుకుని రావడం విశేషం. గతంలో ఫ్రీగా వచ్చే మందు, నాన్ వెజ్ కోసమే సైన్యంలో చేరతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీని వైఎస్సాఆర్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించేది. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం అక్కున చేర్చుకుంది. ఇదే కదా రాజకీయమని మనం సర్దుకోవాల్సిందే