TDP MP Naramalli Sivaprasad Protest Against Notes Banపెద్ద నోట్ల రద్దు సామాన్యుడిపై గుడిబండగా మారుతోన్న వైనంపై ప్రతిపక్ష పార్టీలే కాదు, స్వపక్ష నేతలు కూడా మండిపడుతుండడం విశేషం. ముఖ్యంగా బిజెపికి సన్నిహితంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, టిడిపి ఎంపీ శివప్రసాద్ మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో పార్లమెంట్ సమావేశాలకు ‘బ్లాక్ అండ్ వైట్’ షర్టు ధరించి సమయస్పూర్తిగా నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ సందర్భంగా ‘నల్ల పిల్లి – తెల్ల పిల్లి’ కధ కూడా చెప్పి కేంద్రాన్ని మేలుకోల్పే విధంగా ప్రసంగించారు.

“ఆ రెండు పిల్లులలో ఒకటి పెద్ది, ఒకటి చిన్నది కాగా, అవి రోజు బయటకు వెళ్లేందుకు రెండు రంధ్రాలు తీసారని, చిన్న దానికి చిన్న రంధ్రం, పెద్ద దానికి పెద్ద రంధ్రం తీయగా, మరో వ్యక్తి వచ్చి పెద్ద రంధ్రంలో నుండి చిన్నది కూడా పడుతుంది కదా, ఇంకా చిన్న రంధ్రం ఎందుకు?” అని ప్రశ్నిస్తే ఆ మనిషి బిత్తరపోయాడని, అలాగే బడాబాబులకు కోసం రద్దు చేసిన పెద్ద నోట్ల ఉదంతం కూడా ఇలాగే ఉందని, అసలు వారిని వదిలేసి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్న వైనం కనపడుతోందని, ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తప్పేం లేదని, ప్రజలు హర్షం తెలిపిన వారవుతారని అభిప్రాయపడ్డారు.

కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీని చంద్రబాబు ఎందుకు నేతృత్వం వహిస్తున్నారో తనకు అర్ధం కాని విషయంగా మారిందని, చూడబోతుంటే ఈ పాపం మొత్తం చంద్రబాబుపైకి నెట్టేస్తారేమోనని భయంగా ఉందని శివప్రసాద్ సందేహం వ్యక్తం చేసారు. రోజురోజుకు ప్రజల్లో అసహనం పెరుగుతున్న నేపధ్యంలో… దిద్దుబాటు చర్యలను సరిగా తీసుకోవడంలో కేంద్రం వైఫల్యం స్పష్టంగా కనపడుతుండడంతో, చంద్రబాబుపైకి ఆ అసహనం అంతా పెరుగుతుందేమోనన్న ఆందోళన సదరు టిడిపి ఎంపీ మాటల్లో వ్యక్తమయ్యింది.