MLC_Chiranjeevi_MLC_Srikanthమరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలు వాటికి సెమీ ఫైనల్స్ వంటివని భావించవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలను అమరావతి, మూడు రాజధానులపై ప్రజాతీర్పుగా కూడా భావించవచ్చు. రాష్ట్ర ప్రజలందరూ తమవైపే ఉన్నారని కనుక వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నారు. కానీ మూడు పట్టభద్రుల స్థానాలలో ఉత్తరాంద్రలో టిడిపి అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమలో టిడిపి అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఇక మిగిలిన పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో కూడా టిడిపి గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో వైసీపీ విజయం సాధించి ఉండవచ్చు కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో కూడా అదేవిదంగా గెలిచి ఉండి ఉంటే జగన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు సానుకూలంగా తీర్పు చెప్పారనుకోవచ్చు. కానీ విశాఖను ఏపీ రాజధానిగా, కర్నూలుని న్యాయరాజధానిగా చేస్తామని వైసీపీ చెపుతున్నప్పటికీ ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారనుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి ఈవిదంగా రుచి చూపించారనుకోవచ్చు.

ఇక రాజకీయంగా చూస్తే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ముఖ్యంగా పట్టభద్రుల స్థానాలలో పోటీ చేయకపోవడమే మంచిదని టిడిపి సీనియర్ నేతలు భావిస్తే, ఈ ఎన్నికలలో టిడిపి తప్పక గెలుస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పి ఒప్పించి అభ్యర్ధులను బరిలో దించారు. ఇటీవల రాయలసీమలో తన పర్యటనలు, నారా లోకేష్‌ పాదయాత్ర, రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి నిరసన కార్యక్రమాలలో టిడిపికి ప్రజాధారణ పెరిగిందని చంద్రబాబు నాయుడు గుర్తించారు. కనుక జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతని నిరూపించేందుకు ఈ ఎన్నికలే గొప్ప అవకాశమని పార్టీ నేతలకు గట్టిగా చెప్పడంతో అందరూ కలిసికట్టుగా పోరాడి విజయం సాధించారు.

ఈ ఎన్నికలు జరిగిన తీరును, ఫలితాలను చూసిన తర్వాత ఇప్పుడు టిడిపిలో అందరికీ ఓ విషయం అర్దమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఏవిదంగా అవకతవకలకు పాల్పడిందో అందరూ కళ్ళారా చూశారు. అయినప్పటికీ పక్కా వ్యూహంతో అందరూ కలిసికట్టుగా పోరాడితే వైసీపీని ఓడించడం అసాధ్యం కాదని టిడిపిలో అందరికీ అర్దమైంది. ఓడించగలమనే నమ్మకం ఏర్పడింది కూడా.

కనుక ఇంతకాలం మేము పాడిందే పాట… మేము చెప్పిందే శాసనం అని విర్రవీగుతున్న వైసీపీ నేతలు ఈ చిన్న గుణపాఠంతో ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం చెల్లదనే విషయం ఇంకా గ్రహిస్తారో లేదో?