TDP Mla payyavula keshav strong counter to jagan governmentనేడు శాసనసభ సమావేశాల తొలిరోజునే టిడిపి, వైసీపీల మద్య తీవ్ర వాగ్వాదాలతో కొనసాగాయి. రాజధాని అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా ప్రకటించక మునుపే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో సహా టిడిపి ముఖ్య నేతలందరూ కారు చవుకగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు.

టిడిపి ప్రభుత్వం సేకరించిన ముప్పైవేల ఎకరాలలో పదివేల ఎకరాలు టిడిపి నేతల ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపించారు. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని వాదించారు.

దీనిపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చాలా ఘాటుగా స్పందిస్తూ, “మూడేళ్ళుగా రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?అమరావతిలో మేము ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసి ఉంటే మరెందుకు మాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు? మూడేళ్ళుగా ఏం పీకుతున్నారు?బినామీ చట్టం ఉపయోగించి భూములు తీసుకోవచ్చు కదా?ఆనాడు చంద్రబాబు నాయుడు శాసనసభలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాతే నేను అక్కడ భూమి కొనుకొన్నాను.

అదే విషయం నేను ఎన్నికల అఫిడవిట్‌లో కూడా స్పష్టంగా పేర్కొన్నాను. అయినా మీవాళ్ళు నాపై హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు శాసనసభలో ఎందుకు చెప్పడం లేదు మీరు?హైకోర్టు, సుప్రీంకోర్టులో మీ వాళ్ళకే మొట్టికాయలు పడ్డాయి కదా? మీవాళ్ళు వేసిన కేసులను కోర్టులు కొట్టేశాయి కదా? శాసనసభలో అమరావతి ప్రకటన తర్వాత అక్కడ భూములు కొనుకొంటే తప్పు ఎలా అవుతుంది? మీవాళ్లు కూడా అమరావతిలో భూములు కొన్నారు కదా?ఇప్పుడు మూడు రాజధానులు పేరు చెప్పి మీవాళ్లు విశాఖలో భూములు కొనడం లేదా?దానికి మీరేం సమాధానం చెపుతారు?” అంటూ గట్టిగా నిలదీశారు.