ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఎన్నికలకు అటుఇటుగా కేవలం రెండు నెలలే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా టీడీపీ నుండి వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు వలసలు పెరిగాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ జారిపోయారు. మేడ మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యేలుకాగా, అవంతి శ్రీనివాస్ ఎంపీ. మరో ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తుంది.

ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, వేణుగోపాల్ రెడ్డి కూడా పార్టీని వీడటం ఖాయం అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీ ధైర్యంగానే ఉంది. కనీసం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వైకాపా శ్రేణులు మాత్రం తమ గెలుపు ఖాయం అని తెలియడంతోనే జంప్ జిలానీలు తమ వైపు వస్తున్నారని సంబరపడిపోతున్నారు. ఈ మొత్తం గొడవలో అయోమయంలో ఉన్నది జనసేన మాత్రమే. అసలు ఆ పార్టీలో చేరాలి అనుకునే నేతలే కనపడటం లేదు.

ఆమంచి కృష్ణ మోహన్ మొదట జనసేనలోకి వెళ్ళాలి అనుకున్నా ఆ తరువాత విరమించుకున్నారు. అవంతి శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. పార్టీ మారాలి అనుకున్నప్పుడు అవంతి కనీసం జనసేనను పరిగణలోకి కూడా తీసుకోకపోవడం విశేషం. తోట త్రిమూర్తులు గతంలో జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నారంట.

ఒకవేళ అక్కడకు కుదరకపోతే జనసేన. ఈ విధంగా పార్టీ మారే వారికి అసలు జనసేన కనపడకపోవడం ఆ పార్టీ ప్రభావం ఎంత ఉండబోతుందో చెప్పకనే చెబుతుంది. జనసేన పరిస్థితి కూడా దానికి తగినట్టుగానే ఉంది. అసలు ఆ పార్టీ మొత్తం 175 సీట్లలో పోటీ చేస్తుంది అనే నమ్మకమే చాలా మందికి లేదు. 50-60 సీట్ల కు మించి పోటీ పెట్టలేని పరిస్థితి. కాదూ కూడదు అంటే మాత్రం అటూ ఇటూ వెళ్ళేవాళ్ళందరికీ పిలిచి సీట్లు ఇవ్వాల్సిందే. పైగా ఇదంతా చాలా వరకు స్వయంకృతాపరాధమే. చివరి నిముషం వరకు పవన్ పార్టీని పట్టించుకున్నది లేదు. క్రియాశీలకంగా మారారక కూడా నిలకలేనితనంతో ఎప్పుడు వార్తల్లో ఉంటారో ఎప్పుడు మాయం అయిపోతారో తెలీదు. పార్టీ నిర్మాణము అంతంతే.