Big Breaking: Araku MLA Kidari Sarveswara Rao Shot Dead By Maoistsఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాసేపటి క్రితం మావోల కాల్పుల్లో ఆయన అనుచరుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఒక బస్సులో ప్రయాణిస్తుండగా 50 మంది మావోయిస్టులు బస్సును అడ్డగించి మిగతావారిని పంపించి వేసి, వారితో అరగంట పాటు చర్చించినట్టు సమాచారం.

చర్చలు విఫలం కావడంతో వారిద్దరిని కాల్చి చంపేశారని సమాచారం. కిడారి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. 2014లో కిడారి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది. బాక్సైట్ తవ్వకాలకు నిరసనగానే ఈ హత్య జరిగినట్టు సమాచారం. కిడారి తమ్ముడు కూడా లీజ్ కు తీసుకుని బాక్సైట్ తవ్వకాలు జరుపుతునందుకు ఆయనను వారు పలుసార్లు హెచ్చరించారు.