kamineni srinivas fires on ysrcpఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడానికి ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో విచ్చేసిన సంగతి తెలిసిందే. దీనికి అయిన ఖర్చంతా ఏపీ ప్రభుత్వమే భరించిందని ప్రతిపక్ష పార్టీ వైకాపా ఆరోపించింది. ఖజానా ఖాళీ అయ్యిందని ఓ పక్కన చెబుతూ మరో పక్కన దుబరా ఖర్చులు చేస్తోందని వైకాపా మండిపడుతోంది.

వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి కామినేని శ్రీనివాస్, “పవన్ తన సొంత ఖర్చులతోనే హైదరాబాద్ నుండి విజయవాడ విచ్చేశారని, ఏపీ ప్రభుత్వం భరించిందని వైకాపా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ప్రజా సమస్యలను వివరించేందుకు పవన్ చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఈ విషయంలో వైకాపా నేతల కంటే పవన్ చాలా పరిపక్వతను ప్రదర్శించారని, ఈ సారి వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తీవ్రంగా మండిపడ్డారు.

అధికార పార్టీ సభ్యులే కాక పవర్ స్టార్ అభిమానులు కూడా వైకాపా నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆక్రమాస్తుల కేసులతో నిండా మునిగిపోయి ఉన్న ఆ పార్టీ అధినేత జగన్ను కాపాడుకోవడంలో ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని, అప్పుడు పవన్ లాంటి వారు అసలు వెళ్లే అవకాశం ఉండదని హితవు పలుకుతున్నారు. అయినా పవన్ను విమర్శించేటంత నైతిక అర్హత లేదని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.