tdp-mla-insulting-comment-on-pawan-kalyan2014 సార్వత్రిక ఎన్నికలలో ‘జనసేన’ పార్టీని స్థాపించి, బిజెపి – తెలుగుదేశం పార్టీల కూటమికి మద్దతు తెలిపి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ వలనే టిడిపి అధికారంలోకి వచ్చిందనేది పవన్ అభిమానుల వాదన. రోజా వంటి ఒకరిద్దరి ప్రతిపక్ష నేతలు కూడా ఇదే వాదనను మీడియా ముఖంగా వినిపించారు. అయితే ఈ విషయంపై అసలు పవన్ ఏమనుకుంటున్నారో కూడా గతంలో వెల్లడించారు. టిడిపి గెలుపులో తన పాత్ర కూడా ఉందని, అది 0.0001 శాతమైనా గానీ ఉందని, అందుకే తానూ ప్రశ్నించడంలో తప్పు లేదని బహిరంగంగానే అన్నారు.

అయితే ఈ అంశంపై టిడిపి నేతల్లో మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. పార్టీలో కీలక నేతలు ఎప్పుడూ పవన్ ను పెద్దగా విమర్శించింది లేకపోగా, పవన్ చేసిన సూచనలను తప్పకుండా పరిశీలిస్తాం… అంటూ పవన్ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చిన సందర్భాలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పవన్ పై ఎవరూ ఎలాంటి కౌంటర్ ఎటాక్ లు ఇవ్వవద్దని తన పార్టీ నేతలకు సూచనలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు పవన్ చేసిన అన్ని వ్యాఖ్యలను చంద్రబాబు కూడా సమర్ధించుకుంటూ వచ్చారు.

అయితే కొందరు నేతలు మాత్రం పవన్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడిన సందర్భాలూ కూడా ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా చేరిపోయారు. గత ఎన్నికలలో పవన్ వలన గానీ, ఇంకొకరి వలన గానీ టిడిపి గెలవలేదని, అదే నిజమైతే పంచాయితీ ఎన్నికలలో ఎవరు ప్రచారం చేసారని గెలిచామని, అలాగే ఎంపీటీసీ ఎన్నికలలో పవన్ మా వెనుకాల ఉన్నారని గెలిచామా? వాడొచ్చి గెలిపించాడు, వీడొచ్చి గెలిపించాడు అంటారేంటి? వాళ్ళ అన్నను గెలిపించుకోలేని పవన్ మమ్మల్ని గెలిపించాడా? అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

అంతకు ముందు ఎన్నికలలో చిరంజీవి సొంత జిల్లాలో సైతం ఓటమి పాలయ్యే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో, చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలలో కొంత లాజిక్ ఉండవచ్చు గానీ, ఏదో ‘ఉడత’ సాయం పవన్ చేసారన్న విషయం అందరూ అంగీకరించేదే. అయితే చింతమనేని వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా లాజిక్ లతో మద్దతు తెలుపుతున్నారు. ప్రచారం నిర్వహించనప్పటికీ, తెలంగాణాలో కూడా పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు తెలిపారు కదా… మరి అక్కడ ఎందుకు విజయం సాధించలేదు? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే చింతమనేని ‘దూకుడు’ స్వభావం గతంలో పార్టీకి తిప్పలు తెచ్చినట్లే, ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.