Pawan Kalyan, Bonda Uma Supports Pawan Kalyan, MLA Bonda Uma Supports Pawan Kalyan, TDP MLA Bonda Uma Supports Pawan Kalyan, Bonda Uma Supports Jana Sena Pawan Kalyanతిరుపతి సభలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అధికార తెలుగుదేశం పార్టీ నేతలను గందరగోళానికి గురిచేసినట్లు కనపడుతోంది. అందుకే పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పవన్ వ్యాఖ్యలను మననం చేసుకుంటూ మీడియాకు తమదైన శైలిలో జవాబిస్తున్నారు. కొందరు పార్టీ పరంగా మాట్లాడుతుంటే, మరికొందరు మాత్రం వ్యక్తిగతంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి పవన్ అంత గందరగోళంగా మాట్లాడారా? అంటే కాదు అనే సమాధానమే వస్తుంది.

తెలుగుదేశం పార్టీపై పవన్ ప్రత్యక్ష విమర్శలు చేయనప్పటికీ, చంద్రబాబుపై ఒక సందేహాన్ని లేవనెత్తిన పవన్, ఎంపీలను మాత్రం ఒక రేంజ్ లో ఆదుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ… ‘పవన్ వ్యాఖ్యలు తామూ చెప్తున్నవేనని, స్వాగతిస్తున్నామని, తానెప్పుడూ ఎవరికీ భయపడింది లేదు’ అంటూ వివరణ ఇచ్చుకున్నారు. చంద్రబాబు బాటలోనే రాష్ట్రమంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి తదితరులు పవన్ వ్యాఖ్యలను స్వాగతించారు. అలాగే బోండా ఉమా వంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా పవన్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఇదే సమయంలో మరో వైపు ఎంపీలు మాత్రం తీవ్రంగా స్పందించారు.

జేసీ దివాకర్ రెడ్డి ఓ రేంజ్ లో మాట్లాడారు అనుకున్న తరుణంలో టీజీ వెంకటేష్ మరింతగా చెలరేగిపోవడం విశేషం. ఘాటుగా స్పందించిన టీజీపై తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ కావడం విశేషం. పవన్ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని, క్రమశిక్షణ గల టిడిపిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఏపీ సర్కార్ ఏ విధంగా పోరాడుతుందో పవన్ కూడా అలాగే చెప్పారని… పవన్ వ్యాఖ్యలను సమర్ధించే ప్రయత్నం చేస్తూ టీజీ వెంకటేష్ కు చురకలంటించారు. తాజాగా రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ కూడా తానూ రాజీనామాకు సిద్ధమంటూ కాస్త పౌరుష పదజాలాన్ని ఉపయోగించారు.

మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యల వలన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక వైపు, ఎంపీలు మరో వైపు ఉన్నట్లుగా కనపడుతోంది. అయితే పవన్ ప్రత్యక్షంగా టార్గెట్ చేసింది ఎంపీలే కావడంతో, వారు ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా హిందీ నేర్చుకోమంటూ పవన్ చేసిన ఎటకారపు మాటలు ఎంపీలకు గట్టిగానే తగిలాయి. అయితే పవన్ పై చూపిస్తున్న ఇదే పౌరుషం, అటు కేంద్రంపై కూడా చూపించి, ఏపీకి కావాల్సిన వనరులను రప్పించగలిగితే… అప్పుడే పవన్ కు నిజమైన సమాధానం చెప్పినవారవుతారు.