TDP Manifestoవైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ పోటీలు పడుతూ మీడియా ముందుకు వచ్చి మహానాడులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ తిట్టిపోస్తున్నారు. మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ , జోగి రమేష్, నారాయణ, మాజీ మంత్రి కొడాలి నాని ఇంకా పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుని తిట్టిపోస్తూ, ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఆయన ఇచ్చిన హామీలన్నీ బోగస్, ప్రజలు ఎవరూ వాటిని నమ్మవద్దని వేడుకొన్నారు.

ఒకరు అటువంటి హామీలు వైసీపీ పునాదులు కాదు కదా… వైసీపీ ప్రహారీగోడను కూడా తాకలేవన్నారు. మరొకరు అది మ్యానిఫెస్టో కాదు జస్ట్ చిత్తు కాగితం అంటూ చింపేశారు. వైసీపీ నేతలు ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఒకవేళ మహానాడులో చంద్రబాబు నాయుడు భూటకపు హామీలు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రజలు గుర్తించలేరన్నట్లు వైసీపీ నేతల మాట్లాడారు. ఒకవేళ భూటకపు హామీలు ఇస్తే నష్టపోయేది టిడిపియే తప్ప వైసీపీ కాదు కదా?

చంద్రబాబు నాయుడు మాటలు, హామీలు అన్నీ భూటకమే అయినప్పుడు వాటి గురించి ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు గొంతుచించుకోవడం దేనికి? వాటిని అసలు తాము పట్టించుకోవడం లేదని, వైసీపీపై వాటి ప్రభావం ఉండబోదని అంత నమ్మకమున్నప్పుడు, అంత మంది పోటీలు పడి వాటి గురించి అంత గట్టిగా వాదించడం దేనికి?అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన్నట్లు ఈ హామీలతో వైసీపీ పునాదులు కదిలిపోతాయని భయం, ఆందోళన వలననే. కనుక తమ భయాందోళనలను కప్పి పుచ్చుకొనేందుకే వైసీపీ నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనుకోవచ్చు.

టిడిపి ఇచ్చిన హామీలకు వారు అంత ప్రాధాన్యం ఇస్తున్నారంటేనే దానార్దం అవి ‘సూపర్ హిట్’ అయ్యాయని. వైసీపీ నేతలే అవి సూపర్ హిట్ అని ఇంతగా నమ్ముతున్నప్పుడు ఇక ప్రజలు నమ్మకుండా ఉంటారా?

చంద్రబాబు నాయుడు నిన్న మహానాడు వేదికపై నుంచి సంక్షేమ పధకాలకు సంబందించి హామీలను ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సంక్షేమ పధకాల లబ్ధిదారులు రెంటినీ బేరీజు వేసుకొని చర్చించుకోవడం మొదలుపెట్టారు. వాటిలో టిడిపి అమలుచేస్తామని చెపుతున్న హామీలు చాలా మెరుగుగా ఉన్నాయీ కనుక ప్రజలు వాటివైపే మొగ్గు చూపుతారని వేరే చెప్పక్కరలేదు.

ఇదే వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే సినిమా ఇంకా మొదలవలేదు. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే. కనుక ముందుంది ముసళ్ళ పండుగని వైసీపీ నేతలు బాగానే గ్రహించారు అందుకే చిత్తుకాగితమని చెపుతున్న టిడిపి మినీ మ్యానిఫెస్టో గురించే మాట్లాడుతున్నారు.. ఆలోచిస్తున్నారు… బహుశః నిద్రలో కూడా కలవరిస్తున్నారేమో కూడా.