TDP-Manifesto-Welfare-Schemesరాజమహేంద్రవరంలో రెండు రోజులు అట్టహాసం జరిగిన మహానాడు ముగింపు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో ప్రకటించిన కొన్ని హామీలు అప్పుడే వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే, గత నాలుగేళ్ళుగా సంక్షేమ పధకాల నావలోనే ప్రయాణిస్తున్న వైసీపీ, దానితోనే ఎన్నికల వైతరిణి దాటి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటోంది.

దాని కోసం ఎడాపెడా అప్పులు చేస్తూ ఓ పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తూ, మరోపక్క ఆ భారాన్ని తిరిగి లబ్ధిదారులతో సహా రాష్ట్ర ప్రజలందరిపైనే మోపుతోంది. కానీ ఆర్ధిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు, ఇన్ని సంక్షేమ పధకాలను అమలుచేయడానికి వెనకాడుతారని గట్టిగా నమ్ముతోంది. అందుకే టిడిపికి ఓట్లు వేస్తే సంక్షేమ పధకాలన్నీ రద్దు చేస్తుందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకొంటున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించిన సంక్షేమ పధకాలను చూసి వైసీపీ నేతలు దిగ్బ్రాంతి చెంది ఉంటారు. తేరుకొన్నాక నేడో రేపో ఎదురుదాడి ప్రారంభించవచ్చు. అది వేరే విషయం. కానీ వైసీపీ అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటే, టిడిపి సంపద సృష్టించి దాంతో ఇంకా గొప్పగా సంక్షేమ పధకాలు అమలుచేస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట గమనార్హం.

నెత్తిన జుత్తు ఉంటే ఎన్ని రకాలుగానైనా సింగారించుకోవచ్చన్నట్లు, సంపద సృష్టించుకొంటే దానిని పదిమందికి పంచినా ఎటువంటి నష్టమూ ఉండదని పొరుగున తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నిరూపించి చూపిస్తున్నారు. అదే అప్పులు చేస్తూ సంక్షేమ పధకాలను అమలుచేస్తే రాష్ట్రం పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్వయంగా అనుభవించి మరీ తెలుసుకొంటున్నారు.

కనుక చంద్రబాబు నాయుడు మినీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో నిన్న ప్రకటించిన సంక్షేమ పధకాలు, హామీల వలన రాష్ట్రానికి ఏమాత్రం నష్టం కలుగకపోగా, జగనన్న భాషలో చెప్పుకొంటే ‘ప్రతీ ఇంటికీ మేలు’ జరుగుతుంది.

రాజధాని నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి పట్ల జగన్ ప్రభుత్వానికి ఎలాగూ చిత్తశుద్ధి లేదు. కనీసం తమ పార్టీని గట్టెక్కిస్తాయనుకొంటున్న సంక్షేమ పధకాల అమలు విషయంలోనైనా నిబద్దత, చిత్తశుద్ధి ఉందా అంటే అదీ కనిపించదు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, చివరికి సామాజిక పించన్ల భారం తగ్గించుకోవడానికి నిబందనలు, ఆంక్షల పేరుతో ఏవిదంగా కోత విధిస్తోందో లబ్ధిదారులకు సైతం తెలుసు.

కానీ చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ కుటుంబంలో 18-59 ఏళ్ళ మద్య మహిళలందరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తానని హామీ ఇచ్చారు. అదే తరహాలో అన్నదాతలకు ఏటా రూ.20,000 ఆర్ధిక సాయం అందజేస్తామని ప్రకటించారు.

జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పధకంలో ఇంట్లో ఒక్క బిడ్డ చదువుకే డబ్బు ఇస్తుంటే, ‘తల్లికి వందనం’ పధకం ద్వారా తాము ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 చొప్పున తల్లుల ఖాతాలు వేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

గ్యాస్ సిలిండర్ ధరలు నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రతీ ఇంటికీ ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి త్రాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్ళలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున ఏడాదికి రూ.36,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పిస్తూ ప్రత్యేక చట్టం తెస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో నిరుపేదలను ధనవంతులుగా మార్చేందుకు ‘పూర్ టు రిచ్’ అనే మరో సరికొత్త ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో దీనిని పీ-4 పేరుతో అమలుచేస్తామని చెప్పారు.

టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలు నిలిపివేస్తుందని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నాయకులందరికీ చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై నుంచి జవాబు చెప్పిన్నట్లయింది. దీంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టించారు. అదే సమయంలో సంక్షేమ పధకాల అమలు విషయంలో ప్రజలలో నెలకొన్న అనుమానాలు, అపోహలను చంద్రబాబు నాయుడు పటాపంచలు చేశారు కూడా. దటీజ్ చంద్రబాబు నాయుడు!