TDP Mahanaadu Rajamahendravaram‘పరమత సహనం’ అనే మాట మనం ఎప్పుడో ఓసారి వింటూనే ఉంటాము. దాని అర్దం, అవసరం అందరికీ తెలుసు. అదేవిదంగా ఇప్పుడు ‘పరపార్టీ సహనం’ కూడా చాలా అవసరమనిపిస్తోంది. టిడిపి ఏటా మహానాడు సభలు నిర్వహించుకొంటుంది. అలాగే రేపు ఎల్లుండి (శని,ఆదివారం) రాజమహేంద్రవరంలో మహానాడు సభలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటోంది. దానికి వైసీపీ అడుగడుగునా అవరోధాలు కల్పిస్తూనే ఉందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

వైసీపీ అధినేత మొదలు ఎమ్మెల్యే వరకు అందరూ నోరు విప్పితే నీతులే వల్లిస్తుంటారు. కానీ మహానాడు సభలకు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. మహానాడుకు రాష్ట్రం నలుమూలల వేలాదిమంది టిడిపి కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారు. వారి కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరితే సహకరించలేదన్నారు.

రాజమహేంద్రవరంలో టిడిపి బ్యానర్లు కట్టుకొంటే కొన్ని చోట్ల వాటిపై వైసీపీ బ్యానర్లు కడుతున్నారు లేదా టిడిపి బ్యానర్లను తొలగిస్తున్నారు. వైసీపీ ఎంపీ భరత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మే12న పట్టణంలో పలు చోట్ల బ్యానర్లు పెట్టారు. కానీ నేటికీ వాటిని తొలగించలేదు. మహానాడు కోసం టిడిపి బ్యానర్లు పెట్టుకొనీయకుండా అడ్డుకొనేందుకే వైసీపీ నేతలు నేటికీ వాటిని తొలగించకుండా ఉంచేశారని, ఒకవేళ వాటిని తాము తొలగించే ప్రయత్నం చేస్తే గొడవపడి పోలీసులతో తమపై కేసులు నమోదు చేయించాలని చూస్తున్నారని గోరంట్ల ఆరోపించారు.

ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేసుకొంటే వాటిని ఏదోవిదంగా అడ్డుకోవడం, ఘర్షణలు సృష్టించి పోలీస్ కేసులు నమోదు చేయించడం, ఇటువంటి అవరోధాలు సృష్టించడం వైసీపీకి నీచమైన ఓ దురాలవాటుగా మారిపోయిందని గోరంట్ల అన్నారు. తెలుగు ప్రజలందరూ గౌరవించే యుగపురుషుడు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా, టిడిపి జరిపించబోతే అవరోధాలు సృష్టిస్తుండటం చాలా శోచనీయమని గోరంట్ల అన్నారు. మహానాడుకు ఆటంకాలు కల్పించాలనుకోవడం దిగజారుడు రాజకీయాలు మాత్రమే కాదు, వైసీపీలో అభద్రతాభావానికి, ప్రతిపక్షాల పట్ల అసహనానికి కూడా నిదర్శనంగా చెప్పుకోవచ్చన్నారు.

మహానాడుకి అడిగినన్ని బస్సులను నడిపిస్తే నష్టాలలో మునిగిపోతున్న ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం లభిస్తుంది. కానీ వైసీపీ విద్వేష రాజకీయాల కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోతోంది. మహానాడుకు బస్సులు ఇవ్వకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాలలోని టిడిపి నేతలు, కార్యకర్తలు వందలాది మరబోట్లతో గోదావరి కాలువల ద్వారా రాజమహేంద్రవరానికి బయలుదేరారు. వాటిని టిడిపి జెండాలు, బ్యానర్లతో అలంకరించి, మైక్ సెట్లు బిగించుకొని టిడిపి పాటలు వినిపిస్తూ గోదావరి కాలువలలో తరలివస్తుంటే దారిలో ప్రజలందరూ అబ్బురంగా చూస్తున్నారు. దీంతో మహానాడుకి వెరైటీగా ప్రచారం లభిస్తోంది.

మహానాడుకు వైసీపీ నేతలు, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పిస్తే అవన్నీ మీడియా వార్తలలో వస్తూనే ఉంటాయి. తద్వారా వైసీపీయే మహానాడు సభలకు ఉచితంగా పబ్లిసిటీ చేసిన్నట్లవుతుందని మరిచిపోతున్నారు.