tdp lok sabha membersవిభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సస్పెండ్‌ చేశారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా వారు మాట వినకపోవడంతో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ వారిపై వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు కూడా ఉండడం గమనార్హం.

ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్‌, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. వారిని సస్పెండ్ చేసిన తరువాత సభను మధ్యహ్నం 2 గంటలకు వాయిదా వేశారు సభాపతి. కేంద్రంపై పోరులో ఈ సస్పెన్షన్లు కీలకం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఇతోధికంగా కష్టపడుతున్నట్టు టీడీపీ చెప్పుకోవడానికి వీలు అవుతుంది.

మరోవైపు గత ఏడాది వైకాపా లోక్ సభ ఎంపీలు అందరూ విభజన హామీలు నెరవేర్చకపోవడంతో తమ పదవులకు రాజీనామాలు చేసారు. అయితే రాజీనామాలు చేసినా ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని రాజీనామాలు చెయ్యడంతో వాటి ప్రభావం ప్రజల మీద లేకుండా పోయింది. రాజ్య సభ లో ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సభను అడ్డుకోకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా పార్లమెంట్ లోని గాంధీ బొమ్మ వద్దే నిరసన తెలుపుతున్నారు.