TDPఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో అధికార పార్టీకే బలం ఎక్కువగా ఉంటుంది కనుక దాని అభ్యర్ధులు ఎమ్మెల్సీలుగా గెలవడం సర్వసాధారణమైన విషయమే. కానీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారీ మెజార్టీతో గెలుపొందితే అదీ… తప్పక చెప్పుకోవలసిన విషయం.

విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 5వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్ధి వేపాడ చిరంజీవి రావు 58,957 ఓట్లు సాధించి తన సమీప వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ మీద 20,310 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇంకా మరో 3 రౌండ్ల లెక్కింపు మాత్రమే ఉంది.

ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచే టిడిపి అభ్యర్ధి అధిక్యతలో దూసుకుపోతున్నారు. కనుక మిగిలిన మూడు రౌండ్లలో కూడా ఇదేవిదంగా ఆధిక్యత సాధించవచ్చు. 5వ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్ధికి 38,647, పిడిఎఫ్ అభ్యర్ధి రమాప్రభకు 23,575, బిజెపి అభ్యర్ధి పీవీఎస్ మాధవ్‌కు కేవలం 6,928 ఓట్లు వచ్చాయి.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిడిపి అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ 49,173 ఓట్లు సాధించి తన సమీప వైసీపీ ప్రత్యర్ధి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై 9,558 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్ర రెడ్డి 28,872 ఓట్లు సాధించి తన సమీప టిడిపి అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మీద 1,943 ఓట్లు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన రామచంద్రా రెడ్డి కేవలం 169 ఓట్లతో… అదీ… మూడో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బలపరిచిన చంద్రశేఖర్ రెడ్డి కేవలం 2,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఉత్తరాంద్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధులు 20,310 ఓట్లు, 9,558 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతుంటే, మిగిలిన స్థానాలలో ప్రభుత్వం అందండలున్నప్పటికీ వైసీపీ అభ్యర్ధులు ఇంత తక్కువ మెజార్టీతో గెలుపొందడం గమనిస్తే ఉపాధ్యాయులు, విద్యావంతులలో వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్దం చేసుకోవచ్చు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పదో తరగతి ఫెయిల్ అయినవారిని కూడా పట్టభద్రులుగా పేర్కొంటూ వైసీపీ దొంగ ఓట్లు వేయించుకొన్నప్పటికీ వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు అతి తక్కువ మెజార్టీతో గెలుపొందడం ఆశ్చర్యకరం.

కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖను రాష్ట్ర రాజధానిగా చేస్తామని వైసీపీ హామీ ఇస్తున్నప్పటికీ, అటు రాయలసీమవాసులు, ఇటు ఉత్తరాంద్ర ప్రజలు కూడా వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో స్పష్టమవుతోంది.