tdp leaders fight about anna canteens in Sattenapalleరాష్ట్ర వ్యాప్తంగా వివిద జిల్లాలలో టిడిపి నేతలు ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్‌లపై వైసీపీ నేతలు, వారి కనుసన్నలలో పనిచేస్తున్న పోలీస్, మున్సిపల్ సిబ్బంది దాడులు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అధికార వైసీపీ నేతలతో పోరాడవలసిన తెలుగు తమ్ముళ్ళు తమలో తామే కీచులాడుకొంటూ పార్టీ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టిడిపి కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద కోడెల శివరాం వర్గానికి చెందిన తెలుగు యువత నేత మల్లి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేయగా, దానికి సమీపంలోనే టిడిపి నేత వైవీ ఆంజనేయులు వర్గం మరో అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేసింది.

దీంతో ఇరువర్గాల మద్య గొడవ జరిగింది. వైవీ ఆంజనేయులు వర్గం కోడెల శివరాం ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్‌ను అక్కడి నుంచి వేరే చోటకి తరలించాలని కోరారు. కానీ అందుకు వారు నిరాకరించడంతో వైవీ ఆంజనేయులు వర్గం వారి అన్నా క్యాంటీన్‌పై దాడి చేసి టిడిపి ఫ్లెక్సీ బ్యానర్లను చించివేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం కొట్టుకొన్నారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు.

టిడిపి నేతలు ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్‌లపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సత్తెనపల్లిలో టిడిపికి చెందిన ఇద్దరు నాయకులే పరస్పరం దాడులు చేసుకొని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. టిడిపి నేతలు తమలో తాము కొట్టుకోవడం చూసి వైసీపీ నేతలు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

వైసీపీని రాజకీయంగా ఎదుర్కొని పోరాడవచ్చు కానీ టిడిపిలో నేతలు ఈవిదంగా కుమ్ములాడుకొంటే దాని వలన వారూ నవ్వులపాలవుతారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఎక్కువ మంది టిడిపి నేతలు అన్నా క్యాంటీన్‌లు నిర్వహించాలనుకొంటే వేర్వేరు ప్రాంతాలలో పెట్టుకోవచ్చు లేదా ఒకేచోట ఒకరి తర్వాత మరొకరు నిర్వహించవచ్చు కదా? వైసీపీతో పోరాడవలసిన టిడిపి నేతలు తమలో తామే పోరాడుకొంటే నష్టపోయేది ఎవరు? ఆలోచిస్తే మంచిది.