TDP-Leaders-Complaint-To-Governor-Over-Stone-Pelting-On-Chandrababu-Naiduఈనెల 4వ తేదీ రాత్రి నందిగామలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలో పాల్గొంటున్నప్పుడు హటాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటనే కొందరు ఆయనపై రాళ్ళతో దాడి చేశారు. ఆ దాడిలో డీఎస్పీ హోదా కలిగిన చంద్రబాబు నాయుడి భద్రతాధికారి గాయపడ్డారు. చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నప్పుడే హటాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, వెంటనే ఆయనపై రాళ్ళ దాడి జరగడం చూస్తే అది ముందత్తు ప్లాన్ అని అర్దమవుతూనే ఉంది. అయితే ఇదేమంత పెద్ద విషయం కాదన్నట్లు పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై టిడిపి నేతలు ఈరోజు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, “విశాఖలో మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు చెప్పులు విసిరితే వారు మంత్రులపై హత్యాప్రయత్నం చేశారంటూ తీవ్రమైన సెక్షన్స్ కింద కేసులు పెట్టి రిమాండ్‌పై జైలుకి కూడా పంపారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పు చూపి హెచ్చరిస్తూ మాట్లాడితే ఆయనపై సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీలో అందరికీ కోపం వచ్చేసింది. కానీ రాష్ట్రంలో ప్రదాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడిపై కొందరు రాళ్ళ దాడి చేస్తే అదేమీ పెద్ద కేసు కాదన్నట్లు, కేవలం రూ.100 సొంత పూచీకత్తుపై బెయిల్‌ పొందగలిగేలా సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ హోదా కలిగిన చంద్రబాబు నాయుడి భద్రతాధికారి మధుబాబు ఈ దాడిలో గాయపడ్డారు. అయినా ఇదేమి పెద్ద నేరం కాదన్నట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది,” అని అన్నారు.

టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం తమను పోలీసులతో వేదిస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు పోలీసుల సమక్షంలోనే భౌతికదాడులకు పాల్పడుతోంది. అందుకే మేము గవర్నర్‌ని కలిసి పిర్యాదు చేయవలసి వచ్చింది. భౌతికదాడులతో మమ్మల్ని భయపెట్టగలమని వైసీపీ ప్రభుత్వం అనుకొంటే అంత కంటే అవివేకం మరోటి లేదు. ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనని కలిసి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరాము,” అని అన్నారు.