TDP leaders attack on Kanna - Lakshmi - Narayanaనిన్న కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు కొందరు బీజేపీ కార్యకర్తలు. దీనికి ప్రతిగా ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోదీ, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటీగా ఆందోళనకు దిగారు. కన్నాకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఒక దశలో టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడి కూడా చేశారు. పోలీసులు కలగచేసుకుని వారిని నియంత్రించారు. అయితే కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి కన్నా ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.

గవర్నర్‌ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సరే అమిత్ షా మీద హత్యాయత్నంకు ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తునట్టు? ధర్నా చేస్తే హత్యాప్రయత్నం అంటే నిన్న కాకినాడలో బీజేపీ కార్యకర్తల మీద ముఖ్యమంత్రి మీద హత్యాప్రయత్నం కేసులు పెట్టొచ్చా?

అప్పుడు నిరంకుశంగా కేసులు పెట్టారు అంటారు. ఇదంతా సరే జగన్‌, పవన్‌పై హత్యాప్రయత్నం చేశారు ఆంటే సర్లే అనుకోవచ్చు. బీజేపీకి రాష్ట్రంలో ఏముందని వారి మీద హత్యాప్రయత్నం? ఇదంతా ఏదోరకంగా వార్తలలో ఉండటానికి బీజేపీ వారి తిప్పలు అనుకోవాలా? మనం నిరసన చేస్తే ప్రజాస్వామ్య హక్కు వేరే వాళ్ళు చేస్తే హత్యాప్రయత్నం లాంటి పెద్ద పెద్ద మాటలు అనేస్తే ఎలా కన్నా గారూ? ఈ ఉత్సాహంగా కేంద్రం నుండి దండిగా నిధులు తెచ్చే దాంట్లో చూపిస్తే ప్రజలు హర్షిస్తారు.