TDP-leaders-with-Lokeshప్రతిపక్ష పార్టీ సభ్యుల సస్పెన్షన్ లతో., చర్చను ఎదుర్కొనే సాహసం లేని అధికార పార్టీ తీరుతెన్నులతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. మద్యం మరణాల మీద ప్రభుత్వం చర్చకు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుండగా, పెగాసస్ కొనుగోలుపై చర్చ చేద్దామని ప్రభుత్వం అంటోంది. యధావిధిగా స్పీకర్ టీడీపీ సభ్యుల సస్పెన్సషన్ తో కధ సుఖాంతం అయ్యింది.

సస్పెన్షన్ తో సభ నుండి బయటకు వచ్చిన టీడీపీ నేతలు లోకేష్ తో కలసి ముఖ్యమంత్రి జగన్ కు ‘మద్యాభిషేకం’ చేశారు. దేశానికీ అన్నపూర్ణగా పేరు గణించిన ఆంధ్రప్రదేశ్ ను జగన్ ప్రభుత్వం నాటు సారా తయారీ కేంద్రంగా., కల్తీ మద్యం కొనుగోలు బడ్డీలుగా., డ్రగ్స్ – గంజాయి వంటి మత్తు పదార్ధాలు సరఫరా చేసే సప్లయిర్ గా మార్చారని లోకేష్ అండ్ కో ఆరోపించారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ఇంతమంది చనిపోతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇంకా ఆ మరణాలను “గొడ్డలి పోటుని – గుండె పోటుగా” మార్చిన చందంగా సహజ మరణాలు., అనారోగ్య మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్.

మద్య నిషేధం హామీ ‘గోవిందా గోవిందా’ అంటూ అసెంబ్లీ ఆవరణలో నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే లు., ఎమ్మెల్సీలు. కల్తీ మద్యంతో ‘జే’ బ్రాండులతో ఏపీలో మద్యం దుకాణాలు నిండిపోయాయని., అవి తాగిన ప్రజల ప్రాణాలు గాల్లోనే అంటూ విమర్శలు చేసారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని కాదు, ప్రముఖ బ్రాండ్లను జగన్ నిషేధించి తన సొంత బ్రాండ్లను తెచ్చుకున్నారని మండిపడ్డారు.

మద్యం రేట్లు పెంచి పేద ప్రజల బలహీనతతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఈ ‘జే’ బ్రాండ్లను వెంటనే రాష్ట్రము నుండి నిషేధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఫోటోకు ‘జే’ బ్రాండ్ల మద్యం బాటిల్స్ తోనే అభిషేకం చేసి ‘లోకేష్ అండ్ కో’ నిరసనను తెలియచేసారు.