PattabhiRam Press Meetగంజాయి స్మగ్లింగ్ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన టిడిపి నేత పట్టాభి చేసిన విమర్శలు… తదుపరి జరిగిన సంఘటనలు… తెలిసినవే. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న పట్టాభి, తాజాగా ఇసుక టెండర్ల విషయంలో వైసీపీ సర్కార్ ను దుమ్మెత్తిపోస్తూ తీవ్రమైన ఆరోపణలు చేసారు. సామాన్య ప్రజలకు ఇసుకను దూరం చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు జీవనం లేకుండా చేస్తోందని, దీని వలన పనులు లేక కూలీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

“జయప్రకాశ్ పవర్ వెంచర్స్” అనే సంస్థకు ఇసుక టెండర్లను కట్టబెడుతూ “ఫిక్సింగ్” జరిగిందని, కేవలం రెండు కంపెనీల ద్వారా డమ్మీ టెండర్లను వేయించి, తద్వారా “జయప్రకాశ్ పవర్ వెంచర్స్”కు టెండర్లను అప్పగించారని… ఈ ఫిక్సింగ్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరో చెప్పాలని… ‘రాజన్న రాజ్యంలో ఉన్న ఫిక్సింగ్ రాజా’ ఎవరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ టెండర్
వ్యవహారాలన్నీ నిర్వహించిన ఎం.ఎస్.డి.సి. సంస్థ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ కుంభకోణం వెలుగుచూసిందని చెప్పుకొచ్చారు.

100 కోట్ల పై విలువ ఉన్న టెండర్లన్నీ జ్యూడిషల్ ప్రివ్యూకు పంపిస్తామని గతంలో చెప్పిన వైసీపీ సర్కార్, ఇప్పుడు ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించారు పట్టాభి. ‘పారదర్శకత-నీతి-నిజాయితీ’ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెప్తుందని, ఒక ముఖ్యమంత్రిగా రాష్టానికి ఏమీ తీసుకురాలేకపోయిన జగన్, ఒక యూనివర్సిటీని తీసుకువచ్చేలా ఉన్నారని, అదే ‘వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ’ అని ఎద్దేవా చేసారు.

ఇందులో గుట్టుచప్పుడు కాకుండా ‘ఫిక్సింగ్’ ఎలా చేయాలో క్లాసులు నిర్వహిస్తారని, బహుశా క్రికెట్ బుకీల వంటి వారికి కూడా శిక్షణ ఇస్తారేమోనని, అందులో వైసీపీ వర్గాలు నైపుణ్యత గడించాయని ఆరోపణలు గుప్పించారు. రెండు సంవత్సరాల కాలానికి ఇచ్చిన ఈ టెండర్ కుంభకోణం గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. అయితే తీవ్రస్థాయిలో పట్టాభి మరోసారి చేసిన ఈ విమర్శలకు పర్యవసానాలు ఎలా ఉంటాయోనని వాపోవడం వీక్షకుల వంతు!