విజయవాడలో జరుగుతోన్న మహానాడులో పాల్గొన్న టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వేదికపై మాట్లాడుతూ చెప్పిన కథకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడుపుబ్బా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగిస్తూ… “ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, అలమేలు మంగమ్మ కూర్చొని మాట్లాడుకున్నారట. మంగమ్మతో వెంకటేశ్వర స్వామి అన్నాడట.. మంగమ్మ మంగమ్మ మనకు జనం గుడి కట్టిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, వారి కోసం ఏదైనా ఒకటి చేద్దామన్నాడు.

అలమేలు మంగమ్మ కూడా ఒప్పుకుంది… దాంతో గర్భగుడిలోకి ఎవరైనా వస్తే మనం లేచి నిలబడదాం అని అనుకున్నారు. ఇక ఎవరు వచ్చినా వారు లేచి నిలబడుతున్నారు. అయితే రాకరాక వైసీపీ అధినేత జగన్ వెళ్లాడు… మంగమ్మ లేచింది… వెంకటేశ్వర స్వామి మాత్రం నిలబడ లేదు… మంగమ్మను కూడా కూర్చోమని వెంకటేశ్వర స్వామి అంటున్నాడు… రెండు నిమిషాల తరువాత జగన్ వెళ్లిపోయాడు… ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని మంగమ్మ అడిగింది, ఎందుకు లేవలేదు స్వామీ? అని… నీకు తెలియదు జగన్ కుర్చీలేక తిరుగుతున్నాడు… మనం లేస్తే జగన్ ఇందులో కూర్చుంటాడు అని అన్నాడట.

జగన్ వెళ్లిన తరువాత మళ్లీ స్వామికి అనుమానం వచ్చింది… జగన్ ను తొంగిచూశాడు… ఏమైంది స్వామి, అలా చూస్తున్నావని వెంకటేశ్వర స్వామిని మంగమ్మ అడిగింది. హుండీని చంకలో పెట్టుకుని పోతున్నాడేమోనని చూస్తున్నానని అన్నాడు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటున్నారు. జగన్ జైలు యాత్ర, భార్య భారతి బెయిలు యాత్ర, తల్లి ఢిల్లీ యాత్ర, చెల్లి పాదయాత్ర, అనిల్ మత ప్రచార యాత్ర, వైసీపీ నేతలందరికీ తీర్థయాత్రలు తప్పట్లేదు” అన్నారు. దీంతో నర్సీ రెడ్డి స్పీచ్ కు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా పగలబడి మరీ నవ్వారు.